బీజేపీకి ఐదు ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలు

– అమిత్‌ షా, నడ్డాతో చంద్రబాబు, పవన్‌ రెండో దఫా చర్చలు
– మోడీ నాయకత్వంలో టీడీపీ, జనసేన పనిచేస్తాయి
– ఉమ్మడి ప్రకటనను విడుదల చేసిన బీజేపీ కేంద్ర కార్యాలయం
– ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కలిసి పనిచేస్తాం: నడ్డా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీ ఐదు లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్టు సమాచారం. అయితే సీట్ల పంపకాలపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. శనివారం నాడిక్కడ కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీి నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగింది. జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్‌, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లు సమాచారం. మిగిలిన 17 లోక్‌సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుట్లు తెలుస్తుంది. అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్‌, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్లు సమాచారం. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం మూడింటిలో రెండు చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధ్యక్షుడు ఎన్‌. చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సంయుక్తంగా పత్రికా ప్రకటనను బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ”ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైతన్యవంతమైన దూరదృష్టి గల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జేఎన్‌పీ) దేశ పురోగతి, అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయి. త్వరలో జరగబోయే లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత పదేండ్లుగా దేశ అభివృద్ధి, ప్రగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. టీడీపీ, జనసేనలతో కలిసి పోటీ చేయడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడంలో దోహదపడుతుంది.
సీట్ల పంపకాలపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం
”బీజేపీ, టీడీపీల మధ్య పాత సంబంధాలున్నాయి. టీడీపీ 1996లో ఎన్డీఏలో చేరి, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కలిసి విజయవంతంగా పనిచేసింది. 2014లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన ఆంధ్రప్రదేశ్‌లో 2014 సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు మద్దతిచ్చింది. సీట్ల పంపకానికి సంబంధించి విధివిధానాలను ఒకటి రెండు రోజుల్లో చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నిరీక్షణకు తగ్గట్టుగానే కూటమి ప్రజల సంపూర్ణ మద్దతుతో వస్తుందని మేము ఆశిస్తున్నాము” అని ప్రకటనలో తెలిపింది.
టీడీపీ, జనసేతో కలిసి పోటీ చేస్తాం: నడ్డా
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ”ఎన్డీఏలో చేరాలని నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశాభివద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, ప్రజల మేలు కోసం కలిసి పనిచేస్తాం” అని ట్విట్టర్‌ వేదికగా నడ్డా ప్రకటించారు.
రఘురామకు చేదు అనుభవం
ఇదిలా ఉండగా.. ఎంపీ రఘురామ కృష్ణరాజుకు చేదు అనుభం ఎదురైంది. చంద్రబాబు, పవన్‌ తమ వెంట రఘురామను అమిత్‌ షా వద్దకు తీసుకువెళ్లలేదు. దీంతో, సిబ్బంది కూడా ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనను లోపలికి అనుమతించాలని ఫోన్‌ కాల్స్‌ మీద కాల్స్‌ చేశారు. అయినా కూడా రఘురామను లోపలికి అనుమతించలేదు. ఇక చేసేదేమీ లేక వారు బయటకు వచ్చేంత వరకు రఘురామ గేటు బయటే నిలబడ్డారు.