– ముగిసిన ప్రధాన పరీక్షలు : ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి శనివారం వరకు ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ముగిశాయి. శనివారం ఏడోరోజు సోషల్ స్టడీస్ పరీక్షను నిర్వహించామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 4,95,146 మంది దరఖాస్తు చేస్తే, 4,93,664 (99.70 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. 1,482 (0.30 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు. ప్రయివేటు విద్యార్థుల్లో 669 మంది దరఖాస్తు చేసుకుంటే, 404 (60.39 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 265 (39.61 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఏడోరోజు ఒక్క విద్యార్థిపై కూడా మాల్‌ప్రాక్టీస్ కేసును నమోదు చేయలేదని వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదో తరగతి పరీక్షల సిబ్బందిలో ఐదుగురిపై వేటు వేశామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్ అధికారి, ముగ్గురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఏప్రిల్ ఒకటిన సోమవారం ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్)తోపాటు ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ), ఏప్రిల్ రెండున మంగళవారం ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్) పరీక్షలుంటాయి.