పాట్నా: బీహార్‌లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో పిడుగుపాటుకు గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మూడురోజుల క్రితం పిడుగులు పడి 12 మంది మరణించారు. దీంతో, ఈ ఘటనల వల్ల మృతుల సంఖ్య 17కి పెరిగింది. బత్నాహా గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో పిడుగుపడటంతో అక్కడ పనులు చేస్తున్న మకున్ సూఫీ, అషినా ఖాతూన్ ్దరు, ఖుతౌనా మరణించారు. దుమారియా గ్రామంలో సంగీతాదేవి, మంజుదేవిలు కూడా పిడుగుపాటుకు గురై చనిపోయారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తరారీ బ్లాక్ పరిధిలోని బర్కాగావ్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో పిడుగుపడటంతో 18 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారంతా సదర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో 38 మంది పిడుగుపాటుతో మరణించిన ఘటనలు మరవకముందే బీహార్‌లోనూ అలాంటి ఘటనలే జరగడం గమనార్హం.