
– గృహ, వాహన ఇతర వాటికీి వర్తింపు
– త్వరలో విధివిధానాలు : ఆర్బీఐ వెల్లడి
– కీలక వడ్డీ రేట్లు యథాతథం
ముంబయి: రుణ గ్రహీతలకు అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం కల్పించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. తరుచుగా మారుతున్న వడ్డీ రేట్లతో అయోమయంలో ఉన్న వారికి ఇది ఊరట కల్పించనుంది. ముఖ్యంగా ప్రయివేటు విత్త సంస్థలు అప్పులిచ్చే సమయంలో ఆకర్షణీయ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తూ.. ఆ తర్వాత ఇబ్బడిముబ్బడిగా పెంచడం, అసంబద్ద చార్జీలను వసూలు చేయడం లాంటివి చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గృహ, వాహన, రిటైల్ ఇతర రుణాలపై స్థిర వడ్డీ రేటు విధానాన్ని అమలు చేయడానికి త్వరలోనే విదివిధానాలు రూపొందిస్తా మని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్షా నిర్ణయాలను గురువారం దాస్ మీడియాకు వెల్లడించారు. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి స్థిర వడ్డీ రేటుకు మారడానికి రుణగ్రహీతలను అనుమతించనున్నా మన్నారు. ఈ విదివిధానాలు త్వరలోనే అమలులోకి రానున్నందున రుణ కాలపరిమితి, ఈఎంఐల గురించి రుణగ్రహీతలకు స్పష్టంగా తెలియజేయా లని బ్యాంకులకు సూచించారు. రుణగ్రహీతలకు సమాచారం అందించకుండానే, వారి సమ్మతి లేకుం డానే బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ రుణాల కాల పరిమితులను అసమంజసంగా పొడిగించిన అనేక ఉదంతాలు తాము చేపట్టిన పర్యవేక్షక సమీక్షలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్బీఐ రెపో రేటులో మార్పుల ఆధారంగా బ్యాంక్‌లు అనుసరించే వడ్డీ రేటునే ఫ్లోటింగ్ రేటు అంటారు. ఫిక్స్‌డ్ రేట్ రుణాలకు మారడం లేదా రుణాలను ముందే చెల్లించి ఖాతా మూసుకోవడానికి సంబంధించిన ఆప్షన్ల గురించి సమాచారం అందించాల్సి ఉంటుందన్నారు. అలాగే వివిధ చార్జీల ను పారదర్శకంగా వెల్లడించేలా.. సవివరమైన మార్గ దర్శకాలను త్వరలో విడుదల చేస్తామని శక్తికాంత దాస్ తెలిపారు. రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు అనుసరించేలా నూతన విధానాన్ని ప్రతిపాదించనున్నామన్నారు.
మూడో సారి యథాతథం..
కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిం చాలని ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. రెపోరేటును 6.5 శాతంగానే ఉంచినట్టు శక్తికాంత దాస్ తెలిపారు. వడ్డీ రేట్లను మార్చకపోవడం వరుసగా ఇది మూడవసారి. ఆర్థిక, మార్కెట్ నిపుణుల అంచనాల మేరకు ఆర్బీఐ నిర్ణయం వెలుపడటం విశేషం. ఆర్థిక సంవత్సరం 2023-24 ఏప్రిల్, జూన్‌లో నిర్వహించిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదు. హెచ్చు ద్రవ్యోల్బణ కట్టడికి 2022 మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి కాలంలో రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4 శాతం నుంచి 6.5 శాతానికి చేరింది.
పిన్ లేకుండా రూ.500 బదిలీ
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపుల వ్యాలెట్ల నుంచి ఎలాంటి పాస్‌వర్డ్, పిన్ లేకుండానే రూ.500 వరకు నగదు బదిలీ చేయడానికి అనుమతించింది. యుపిఐ లైట్‌లో పేమెంట్ కోసం ప్రస్తుతం ఉన్న రూ.200 పరిమితిని రూ.500కు పెంచుతున్నామని శక్తికాంత దాస్ తెలిపారు. యుపిఐ లైట్ చెల్లింపుల పరిమితిని పెంచాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. లైట్ వ్యాలెట్‌లో లోడ్ చేసుకునేందుకు ఉన్న మొత్తాన్ని రూ.2,000కే పరిమితం చేశారు. చెల్లింపుల పరిమితికి సంబం ధించిన సూచనలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అదే విధంగా డిజిటల్ చెల్లింపులకు టెక్నాలజీని జోడించే ఉద్దేశంతో కొత్తగా కన్వర్జేషనల్ పేమెంట్స్ ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం యుపిఐకి కృత్రిమ మేధా (ఏఐ)ని జోడించను న్నామని తెలిపారు. దీంతో ఏఐ ఆధారిత సిస్టమ్స్‌తో మాట్లాడుతూ సురక్షితంగా లావాదేవీలు పూర్తి చేయొచ్చన్నారు. దీనికి సంబంధించి ఎన్‌పీసీఐకి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని దాస్ తెలిపారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశాం : శక్తికాంత దాస్
ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొంటుంటే.. భారత్ మాత్రం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయగలిగిందన్నారు. రానున్న రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2023-24 ఆర్ధిక సంవత్సరం మొత్తం ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉండొచ్చన్నారు.