ఫ్లాగ్‌బేరర్‌ శరత్‌ కమల్‌

ఫ్లాగ్‌బేరర్‌ శరత్‌ కమల్‌– చెఫ్‌డీ మిషన్‌గా మేరీకోమ్‌
– భారత ఒలింపిక్‌ సంఘం వెల్లడి
న్యూఢిల్లీ : 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా వెటరన్‌ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు అచంట శరత్‌ కమల్‌ వ్యవహరించనున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో భారత అథ్లెట్ల బృందాన్ని శరత్‌ కమల్‌ ఫ్లాగ్‌బేరర్‌గా ముందుండి నడిపించనున్నాడు. 41 ఏండ్ల అచంట శరత్‌ కమల్‌ ‘భారత జట్టు ఐక్యత, స్ఫూర్తికి పారిస్‌ వేదికగా ప్రతీకగా నిలుస్తాడని’ భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఓ ప్రకటనలో తెలిపింది. దిగ్గజ మహిళా బాక్సర్‌, ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ చెఫ్‌డీ మిషన్‌గా బాధ్యతలు తీసుకోనుంది. ఆమెకు శివ కేశవన్‌ డిప్యూటీగా ఉండనున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో కీలక షూటర్ల బృందానికి గగన్‌ నారంగ్‌ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ మేరకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.