ద్వేషం మనసుకు పట్టే జాడ్యం
మనిషి మనిషికి మధ్య
దూరాలను పెంచుతూ
కులాల మతాల గోడల్ని
కొత్తగా కట్టుకుంటూ
నిన్నటి ఇరుగు పొరుగు
నేడు అర్థంలేని వైరుధ్యాల
ముళ్ళ కంచెల్ని పాతుకుంటున్నారు
లోకాన సామ్రాజ్య దురహంకారం
బడుగు రాజ్యాలను ఎగదోస్తూ
జాతుల మధ్య వైశమ్యాలను రాజేసి
ఆరని కార్చిచ్చులా కబళిస్తున్నాయి
ఇవ్వాళ దేశాలు విద్వేషాలతో
సరిహద్దు వెంట దుర్భేద్యమైన
అడ్డుగోడలు నిలుపుతున్నాయి
పగ ప్రతీకారాలు
పతాక స్థాయిలో ప్రపంచాన
వినాశకర యుద్ధాల రూపంలో
విరుచుకు పడుతూ
అమాయక జనాల చావులతో
మానవత్వం అన్యాయంగా కాలిపోతోంది
ద్వేషం రంగుమారి వికతంగా
రాజకీయం ముసుగులో
సున్నిత భావోద్వేగాలమంటల్ని
మతం దేవుడంటూ ఎగదోస్తూ
కలిసి బ్రతికే మనుషుల్ని
విడదీసే కుట్రలు కుతంత్రాల
వింతల్ని కనిపెట్టగలగాలి
విద్వేష విషజ్వాలల్ని
ఆర్పేయ గలగాలి
ఉత్తరాన దశాబ్దాల
అయోధ్య బాబ్రీ వివాదం
గోమాత రక్షక దళాల వీరంగాన్ని
రాముడి పేరిట సాగిన
భీభత్సాన్ని మరువకముందే
నేడు కూటమి రాజకీయం
వెంకన్న లడ్డూ కల్తీ పేరిట
కొత్త రాగం సరికొత్తగా ఆలపిస్తోంది
కష్టాల బ్రతుకుల సామాన్యుడికి
వర్షాలు వరదలు తుఫానులు
కన్నీళ్ళ పాల్చేస్తుంటే
నీడలేక గూడులేక
బ్రతుకు తెరువు కోల్పోయి
ఆసరా కోసం
మంచి మార్పుకోసం
ఆశతో ఎదురుచూసే జనాల
నోట్లో వాగ్దానాల మట్టి చల్లి
మతం మత్తును ద్వేషాన్ని
నింపేందుకు కొత్తగా
అవతారం దాల్చిన
సనాతన ధర్మ పరిరక్షకులు
అపర భక్తాగ్రేసరులు
దేవుడి పేరిట ఆడుతున్న
దగా కోరు నాటకానికి
ఇకనైనా తెరదించటం తప్పదు
లేని దేవుడిని ఉన్నాడని
నమ్మే అమాయక
గుడ్డి భక్త జనుల కళ్ళ గంతలు
తొలగి నిజాలను
చూడకలిగే జ్ఞాన నేత్రాలు
ఎప్పుడు తెరుచుకుంటాయో?
(తిరుపతి లడ్డూ వివాద నేపథ్యంలో)
– డా. కె. దివాకరాచారి, 9391018972