– 330 మందికి పైగా మృతి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు ప్రావిన్స్‌ల్లో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ నెల 9వ తేదీ నుంచి భారీ వర్షాలు కురియడంతో నివాస ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. వరద నీటిలో చిక్కుకొని ప్రజలు విలవిల్లాడారు. వర్షాల కారణంగా చోటుచేసుకున్న వివిధ ప్రమాదాల్లో 330 మందికి పైగా మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమం ఆఫ్ఘనిస్తాన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఉత్తర బాగ్లాన్ ప్రావిన్స్‌లో ఈ వరదలకు బాగా దెబ్బతిందని, వెయ్యికి పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయని, ఇక్కడే 300 మందికి పైగా మరణించారని ఐక్యరాజ్య సమితి సంస్థ శనివారం సోషల్ మీడియాలో తెలిపింది. వరద బాధితులకు ప్రస్తుతం ఆహారం అందిస్తున్నట్లు పేర్కొంది. గత నెల రోజులుగా ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు పొంగి వరదలు రావడంతో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు తెలిపారు.