సహజసిద్ధంగా లభించే బార్లీలో అనే ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్-బి నీటిలో కరిగే తత్వం ఉంటుంది. బార్లీలో బి-విటమిన్లు, పీచు పదార్థాలు వంటివి అత్యధిక భాగం పై పొట్టులోనే ఉంటాయి. కాబట్టి బి విటమిన్ కావాలనుకునేవారు బార్లీ గింజలను యధాతథంగా ఉపయోగించాలి. ఎండాకాలం బార్లీ నీళ్లు, బార్లీ పానీయాలు తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బార్లీ గింజలతో కిచిడీ, లడ్డూలు, ఖీర్, వడలు చేసుకుని తింటే రుచితో పాటు ఈ సమ్మర్‌లో కాస్త ఉపశమనం కూడా పొందవచ్చు. వీటి వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఈ హెల్దీ వంటకాలను రుచిగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం…
కిచిడి :
కావాల్సిన పదార్థాలు : బార్లీ గింజలు, కందిపప్పు – కప్పు, నెయ్యి – కొద్దిగా, ఇంగువ, జీలకర్ర – తాలింపుకు సరిపడ, కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ – చిన్నది ఒకటి, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం : బార్లీని కడిగి నీటిలో నానబెట్టండి. ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి వేసి వేడి చేయండి. ఇంగువ, జీలకర్ర వేసి వాటిని నాలుగు నుంచి అయిదు సెకన్ల పాటు వేగనివ్వండి. కొన్ని పచ్చి మిర్చి వేయండి. ఉల్లిపాయలు, లేత రంగు వచ్చే వరకు వేపాలి. ప్రెజర్ కుక్కర్‌లో 3 కప్పుల నీరు, ఉప్పు, పసుపుతో పాటు బార్లీ, కంది పప్పుని వేయండి. కాస్తా సన్నని మంట మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టి 1 విజిల్ వచ్చే వరకూ ఉడికించాలి. ప్రెజర్ పోయే వరకూ అలానే ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా వడ్డించండి.
ఖీర్ :
కావాల్సిన పదార్థాలు : బార్లీ గింజలు- కప్పు, పాలు- 2 కప్పులు, సన్నగా తరిగిన ఖర్జూరం ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు, బాదం- పది (సన్నగా కట్ చేయాలి), జీడిపప్పు- పదిహేను, ఎండు ద్రాక్ష- 10, యాలకులు- 4, తేనె- టీస్పూన్.
తయారీ విధానం : రాత్రంతా బార్లీ గింజలను నానబెట్టుకోవాలి. ఖీర్ చేసుకోవాలంటే వీటిని కనీసం ఏడు గంటల పాటు నానబెట్టాలి. పిండిలా అవుతుంటే సరిగ్గా బార్లీ నానినట్లు అర్థం. ఆ తర్వాత పాన్‌లో పాలు పోసి సిమ్‌లో వేడి చేయాలి. బాగా మరిగిన తర్వాత బార్లీని వేయాలి. మధ్యలో గరిటెతో కలుపుతూ.. ఉడికించుకోవాలి. పాలు చిక్కబడుతుంటాయి. తరిగిన ఖర్జూరం ముక్కలను వేసి కలపాలి. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్షలను వేయాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి కొద్దిసేపు ఉడికించాలి. మధ్యలో గరిటెతో కదుపుతూ ఉండాలి. బార్లీ బాగా ఉడికితే సరి.. ఖీర్ అయినట్లే. ఈ ఖీర్‌లో తేనె వేయాలి. చివరగా బౌల్‌లో వేసుకుని అందులో బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకుని తినాలి.
ఉప్మా :
తయారీ విధానం : ప్రెజర్ కుక్కర్‌లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా కూరగాయల ముక్కలు వేసి కలపండి. ఇప్పుడు బార్లీని వేసి అన్నింటిని కలిపి కొన్ని నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఒక కప్పు నీరు పోయండి. రుచికి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం మంటపై రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. రెడీ అయ్యాక ప్రెజర్ పోయేలా ఉంచండి. మూత తీసి, నీరు పూర్తిగా మొత్తం ఉడికేలా చూసుకోండి. చివరగా కాసింత నిమ్మరసం వేడివేడిగా సర్వ్ చేయండి.
పాయసం :
తయారీ విధానం : అరకప్పు బార్లీని రాత్రి సమయంలో నీళ్లు పోసి నానబెట్టాలి. తరువాత రోజు ఉదయం పొయ్యి మీద గిన్నె పెట్టి లీటర్ పాలను పోసి కొంచెం వేడి అయ్యాక నానబెట్టిన బార్లీని వేయాలి. 15 నిమిషాల పాటు ఉడికించాలి. దానిలో జీడిపప్పు, బాదం పప్పు, డేట్స్ వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నిమిషం తరువాత పొయ్యి పై నుండి కిందకు దించాలి. కావాలనుకుంటే డేట్స్ ముక్కలు వేసుకోవచ్చు. పంచదార వాడే బదులుగా తియ్యదనం కోసం ఖర్జూరం ఉపయోగిస్తే సరిపోతుంది.
లడ్డూ :
కావాల్సిన పదార్థాలు : బార్లీ- 1 కప్పు, పల్లీలు- 1 కప్పు, అవిసె గింజలు- 1 కప్పు, నెయ్యి-2 స్పూన్లు, బాదం- 10, జీడిపప్పు- 10, తురిమిన బెల్లం- 1 కప్పు, యాలకుల పొడి- కొద్దిగా
తయారీ విధానం : ప్యాన్‌లో బార్లీ గింజలను వేసి మాడిపోకుండా లోఫ్లేమ్‌లో ఉంచి కదుపుతూ గోల్డెన్‌కలర్‌లోకి మారేంత వరకూ వేయించాలి. వీటిని బౌల్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలను, అవిసె గింజలను వేరువేరుగా రంగుమారేంత వరకూ వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇపుడు ప్యాన్‌లో నెయ్యి వేసి బాదం, జీడిపప్పులను వేయించుకోవాలి. ఆ తర్వాత పల్లీల పొట్టు తీసేయాలి. జార్‌లో వేయించిన బార్లీ గింజలు, పల్లీలు, అవిసె గింజలను వేరువేరుగా మిక్సీ పట్టాలి. ఈ మూడు పిండిలను బాగా కలపాలి. ఈ మిశ్రమంతో పాటు బెల్లం కూడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇందులోకి వేయించిన బాదం, జీడపప్పులను నెయ్యితో సహా వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత లడ్డూలుగా చేసుకోవాలి. లడ్డులు సరిగా రాకుంటే ఆ మిశ్రమంలో కొద్దిగా కాచిన నెయ్యి వేసి చేసుకోవచ్చు. ఈ లడ్డు రుచిగా ఉంటాయి.
బార్లీ స్మూతీ :
బార్లీ పిండి, బాదం పాలు, తేనె మొత్తం మిక్సీలో వేసుకోవాలి. మీకు నచ్చిన కొన్ని పండ్లనూ వేసి మరోసారి మిక్సీ తిప్పాలి. గ్లాసులో పోసి దానిపై కొన్ని ఫ్లాక్సీ సీడ్స్ పొడి కూడా చల్లుకుంటే.. ఎంతో ఆరోగ్యకరమైన స్మూతీ రెడీ..