జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అవిసెగింజల లాటిన్ పేరు ‘లినమ్ యుసిట టిసిమం’. అంటే ‘చాలా ఉపయోగకరం’ అని అర్ధం. అవిసెగింజలతో మన పెద్దవాళ్ళు చిట్కా వైద్యాలు ఎన్నో చేశారు. తమలపాకు తోటల్లో తమలపాకు తీగను అల్లించడానికి ఈ చెట్టును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎముకల అరుగుదల, జాయింట్ పెయిన్స్‌తో బాధపడేవారు అవిసెగింజలను ఆహార పదార్థాలతో పాటు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
శరీరంలో అధికంగా ఉండే కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడే ఒకే ఒక్క మందు అవిస గింజలేననీ, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కొద్దిగా తీసుకున్నా, ఆకలి తీరిన అనుభూతి పొందుతారు. ముడి అవిసె గింజలలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. వీటిలో ఉండే ఒమేగా యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను చాలావరకూ తగ్గిస్తాయి. అవిసె సన్నని కాడలతో 1.2 మీటర్లు పొడవుగా, నిటారుగా మొక్క చివర్లు 20-40 మీటర్లు పొడవు, 3 మీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది. పూలు స్వచ్ఛమైన నీలం రంగులో ఉండి పండు గుండ్రంగా, ఒక చిన్న యాపిల్ మాదిరిగా ఉంటుంది. దీనిలోని గింజలు గోధుమ విత్తనాల రంగులో ఉంటాయి. ఆకులు ముద రాకుపచ్చ రంగులో ఉండి వాటిలో గ్లూకోజ్ పిండిపదార్ధం ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతుంది.
అవిసె చెట్టులో తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగు… నాలుగు రకాల పూ లు పూసేవి ఉన్నాయి. దీని చెట్టు ఆకు, బెరడు, పూలు చేదుగా ఉంటాయి. వీటి రసం వేడి చేస్తుంది.
అయితే దీని మహాశక్తి వలన కఫ రోగాలు, క్రిమి రోగాలు, పైత్య జ్వరాలు, రక్త పైత్యం హరిస్తుంది. అతి కొవ్వుని తగ్గించి శరీరాన్ని నాజుకుగా చేస్తుంది. అవిసె చెట్టు పూలు కాస్త చేదుగా వున్నాగానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పూలను సేకరించి శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని మెత్తగా దంచి రసం తీసుకోవాలి.
చిన్న పిల్లలకు పళ్లు కొరికే అలవాటు ఉంటుంది. అవిస పూలరసంలో కొద్దిగా మిరియాల పొడిని కలిపి, ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని పిల్లల చేత తినిపిస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.
అవిసె గింజలు ప్రకృతి ఇచ్చిన వరం. దీర్ఘకాలిక గుండె జబ్బులు, కీళ్ళనొప్పులు, ఆస్తమా, మధుమేహం కలిగించే వాపులు తగ్గించటానికి ముఖ్యంగా – క్యాన్సర్లలో కీలమైన కోలన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా శరీరానికి రక్షణ కవచంలాగా సహాయపడుతుంది. అక్రోట్‌తో, చేపలతో ఈ గింజలను కలిపి తీసుకుంటే బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంటుంది. ప్రేగుల పనితీరు బాగుంటుంది. నిత్యం ఫ్లాక్స్ సీడ్స్‌ను తీసుకోగలిగితే షుగర్ అదుపులో ఉంటుంది. అవిసె పిండిని ఇడ్లీ, దోసెపిండిలో తగు మోతాదులో కలుపుకోవచ్చు. అవిసెపిండితో చపాతి చేసుకుని తినొచ్చు.
అవిసెగింగలు వేయించి తింటే కరకర లాడుతూ రుచిగా ఉంటాయి. కాల్చిన అవిసె గింజల పొడిని అన్నంతో తింటారు. ఈ గింజలకు ఎక్కువ కాలం నిల్వ వుండే గుణం ఉన్నందున ఎప్పుడైనా వాడుకోవచ్చు.
ఫ్యాబ్రిక్, అద్దకం, కాగితం, మందులు, జుట్టుకోసం ఉపయోగించే జెల్, రకరకాల సబ్బులు చేయడానికి అవిసె గింజలు ఉపయోగిస్తారు. అవిసె విత్తనాల నుండి ఉత్పత్తయ్యే నూనెను వంటకు ఉపయోగిస్తారు. ఈ నూనెలో ఎలర్జీని నివారించే గుణంతో పాటు తలనొప్పి కూడా తగ్గుతుంది. ఆయుర్వేద వైద్యంలో అవిసె చెట్టు వేరు, ఆకులు, విత్తనాలు, బెరడు మొదలైన అన్ని భాగాల్లోను ఔషధగుణాలు ఉండటం చేత దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది.
అవిసెగింజలు/ ఆకులతో కొద్దిగా గుల్లసున్నం కలిపి నూరి గవద బిళ్లలకు పై పూతగా రాస్తే తగ్గిపోతాయి. అవిశ ఆకుతో వండుకుని తింటే సుఖవిరేచనం కావడమే కాకుండా, శరీరంలోని ఎక్కువగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
అవిసె గింజలు 5 గ్రా, ఆవాలు 5 గ్రా కలిపి మంచినీటితో మెత్తగా నూరిన మిశ్రమాన్ని తలకణతల పై పట్టీలా వేసి పైన కాగితం అంటించాలి. దానిపైన వేయించిన ఇటుక పొడిని బట్టలో మూటకట్టి కాపడం పెడితే అప్పటికప్పుడే పార్శ్వపు నొప్పి తగ్గిపోతుంది.
అవిసె పూలపొడిని గేద పాలతో మెత్తగా నూరి అందులో కొంచం వెన్న కలిపిన మిశ్రమాన్ని నలుగుపిండిలా ఉపయోగిస్తే శరీర నలుపు విరిగిపోతుంది.
అవిసె గింజలు, పసుపు కొమ్ములు సమంగా తీసుకుని మెత్తగా నూరి గడ్డలపై వేసి కట్టు కడుతూ ఉంటే మూడురోజులలో గడ్డలు పగిలిపోయి పుండు మాడిపోతుంది. ప్రతి రోజు అవిసె పూలకూరను అన్నంలో కలుపుకుని వరసగా 21 రోజులు తింటే రేచీకటి పోతుంది.
సీమ అవిసె గింజలు, మినప్పప్పు, గోధుమలు దోరగా వేయించిన పిప్పిళ్ళ పొడి సమ బాగాలుగా కలిపి నలుగు పిండిలా ఉపయోగిస్తే శరీర కాంతి మెరుస్తుంది.
ఈ గింజలను నూనెగా కంటే డైరెక్ట్‌గా తీసుకుంటే శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అందుతాయి.
కిడ్నీ సంబంధిత సమస్యలను తొలగిస్తాయి. ధూమపానం అలవాటున్న వారు అవిసె పూలను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. అవిసె ఆకులను ఆహారంలో చేర్చుకునేటప్పుడు మాత్రం మందులు వాడకూడదు. అదికూడా నెలకు ఒకసారి మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అవిసె గింజలను ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే అలసట తగ్గి, శరీరానికి కొత్త శక్తి వస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చిన్నారులకు రోజూ అవిసె గింజలను తినిపిస్తే చదువుల్లో బాగా రాణిస్తారు. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు డిప్రెషన్‌ను సమర్ధవంతంగా నివారించగలుగుతాయి. మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేసే గుణాలు అవిసె గింజలలో ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే కాక అందానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. జుట్టుని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు అవిసెల్లో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కుష్టువ్యాధితో బాధపడేవారు అవిసె గింజలను తీసుకుంటే మంచి ఫలితాలుంటాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
వీటిని తినడానికి ఉత్తమమైన మార్గం మొలకలు. నానబెట్టి మొలకెత్తించిన అవిసె గింజలను తీసుకోవడం ద్వారా వాటిలోని పోషకాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు. వీటిని కేవలం 10 నిమిషాలు నానబెడితే చాలు మొలకెత్తడానికి. గింజలను అదే విధంగా తింటే వీటిలోని పోషకాలను మన శరీరం పూర్తిగా అందుకోలేదు. అందుకే పొడిచేసి తీసుకోవడం మంచిది. వీటిని తినేటప్పుడు ఎక్కువ నీరు తాగటం మర్చిపోవద్దు. ఉదయాన్నే చేసే అల్పాహారాలైన స్మూతీ, సాండ్విచ్, సలాడ్లలో అవిసె గింజలను కలపొచ్చు. అవిసె గింజల నూనెను వేడి చేస్తే దానిలోని పోషకాలు తగ్గిపోతాయి.
అయితే అవిసెగింజలను ఎక్కువగా తినడం వల్ల అనవసరపు దుష్ప్రభావాల బారిన పడతారు. అవిసె గింజలని గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేస్తే సంవత్సరంపాటు నిల్వ ఉంటాయి. ఒకేసారి కొనుగోలు చేసి వేయించి పొడి చేసుకోవడం మంచిది.
స్నేహపూర్వకమైన సూచన :
అవిసె గింజల ప్రత్యేకత ఏమిటంటే వీటిని భోజనంలో ఒక ఆదరువులాగా తీసుకోవాలి. అవిసె గింజలు భోజానానికి ప్రత్యామ్నాయంగా తీసుకుంటే, వీటిని శరీరం జీర్ణం చేసుకోలేదు. నీటితో రోజూ తీసుకున్నందు వలన, జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఫైబర్ అందుతుంది. ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోండి. ఎంత మోతాదులో ఎందుకు తీసుకోవాలన్నది ఆయుర్వేద వైద్యులు చెప్పే సలహాల మీద ఆధారపడి ఉంటుంది.
అవిసె గింజల కారం పొడి తయారీ
అవిసె గింజలు ఒక కప్పు, పల్లీలు అర కప్పు, మినపప్పు పావు కప్పు, నువ్వులు పావు కప్పు, ధనియాలు పావు కప్పు, మిరియాలు రెండు టీ స్పూన్స్, జీలకర్ర ఒక టీ స్పూన్, మెంతులు పావు టీ స్పూన్, ఎండుమిర్చి 15 నుండి 18, కరివేపాకు ఒక కప్పు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 15 తీసుకోవాలి. ఒక కళాయిలో అవిసె గింజలు, పల్లీలు, మినపప్పు, నువ్వులను విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు వేయించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇవి అన్నీ కూడా చల్లారిన తరువాత ఒక జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో అవిసెగింజల కారం పొడి రెడీ అయినట్లే. దీనిని గాలి తగలకుండా గాజు సీసాలో నిల్వ చేసుకుంటే నెలరోజులు నిల్వవుంటుంది. ఈ కారాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు అవిసెగింజలను కారం రూపంలో రోజువారిగా తీసుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008 577 834