విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి చెకుముకి ఎంతో ఉపయోగపడుతుంది

నవతెలంగాణ –  తుంగతుర్తి
విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు,వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి,శాస్త్రీయ ఆలోచన,పరిశీలన,శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, శాస్త్రవేత్తలుగా ఎదగడానికి,సైన్స్ అధ్యయనాన్ని ప్రోత్సహించేందుకు చెకుముకి టాలెంట్ టెస్ట్ ఎంతో దోహదపడుతుందని తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్,మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక మండల కన్వీనర్ ఎడ్ల గోపయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు.ఈ మేరకు సైన్స్ మన జీవితంలో ఒక భాగమని,ఏదైనా అభివృద్ధి చెందుతున్న దేశం యొక్క విజయం దాని శాస్త్రీయ పురోగతి ద్వారా కొలవబడుతుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను శాస్త్రీయ దృక్పథం వైపు మళ్ళించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని,విద్యా వ్యవస్థలో నాణ్యత పెంచి,మౌలిక వసతులు కల్పించి వారి అభివృద్ధికి దోహదపడాలని కోరారు.మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన పాఠశాలల వివరాలు ఇంగ్లీష్ మీడియం విభాగంలో వెలుగుపల్లి టి ఎస్ ఆర్ ఎస్ బాలుర గురుకుల పాఠశాల, తెలుగు మీడియం విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నారం, ప్రైవేటు పాఠశాలల స్థాయిలో తుంగతుర్తి మేరీ మదర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు.ఈ మేరకు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎంపీపీ కవితా రాములు గౌడ్ బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కొండగడుపుల యాకయ్య,అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురువయ్య,రావులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి,మండల పరిధిలోని వివిధ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.