దుబ్బాక కాలువ బ్రిడ్జిపై తేలిన ఇనుప చువ్వలు..

– పట్టించుకోని ఇరిగేషన్, అర్ అండ్ బీ  అధికారులు…

నవతెలంగాణ-తొగుట : బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు మల్లన్న సాగర్ ప్రాజక్టు నిర్మించారు. ప్రాజెక్టు నుండి మండలాలకు, నియోజవర్గలకు, జిల్లాలకు నీటిని తరలించేందుకు కొండపోచమ్మ, దుబ్బాక కాలువలు నిర్మాణం చేశారు. కాలువ నిర్మాణానికి ఆర్ అండ్ బి, పి ఆర్ రోడ్లు అడ్డంగా ఉన్న ప్రాంతాలలో బ్రిడ్జిలను నిర్మించారు. తొగుట నుండి సిద్దిపేటకు వెళ్ళే రోడు మెట్టు సమీపంలో దుబ్బాక కాలువ నిర్మాణం చేసిన బ్రిడ్జిపై వేసిన సిమెంటు పూర్తిగా తేలిపోయింది. అందులో వేసిన ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా ఉన్నాయి. రాత్రి వేళల్లో, చీకటి సమయాలలో బైకులపై అనేక మంది ప్రయాణం చేస్తుంటారు. ఇనుప చువ్వలు పైకి తేలి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తు న్నారు. రోడ్డుపై ఇంత ప్రమాదకరంగా ఇనుప చువ్వలు తేలి ఇబ్బందికరంగా ఉన్న ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులు స్పందించక పోవడం బాధాకరం అని అవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల సంవత్సరాల, దశాబ్దాల క్రితం నిర్మించిన పురాతన బ్రిడ్జిలు ఇప్పటి వరకు చెక్కుచెదరకుండా ఉంటే ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన బ్రిడ్జిపై ఇనుప చువ్వలు ప్రమాదకరంగా ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నాణ్యత ఏ స్థాయిలో ఉందో అధికారులు నిర్ధారణ చేయాలని అంటున్నారు. రాజీవ్ రహదారి దుద్దెడ వద్ద ఉన్న టోల్గేట్ నుండి తప్పించుకోవడానికి ఈ రోడ్డుపైన భారీగా వాహనాలు వెళుతున్నాయని అన్నారు. అధికంగా వాహనాలు తిరగడం వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతింటున్నది మండిపడుతున్నారు. ఇప్పటి కైనా ఇరు శాఖల అధికారులు ఆ ప్రాంతాన్ని పరి శీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.