జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి

జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి– భవిష్యత్తు అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు
– డీపీిఆర్‌లు సిద్ధం చేయాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
– ఫ్లోటింగ్‌ సోలార్‌ను ప్రోత్సహిస్తాం.. సహకరిస్తాం : పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్లు సింగరేణికి ఇవ్వడమే ఉత్తమం మంత్రి ఉత్తమ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పుణరుత్పాదక విద్యుత్తు ప్రోత్సహకంలో భాగంగా జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయబోతున్నామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం రాత్రి డాక్టర్‌ బీఆర్‌్‌ అంబేద్కర్‌ సచివాలయంలో జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి సింగరేణి సంస్థ ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జలాశయాల్లో 1000 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటి ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి మత్స్య సంపదకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా డీపీఆర్‌లు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పత్తికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఇరిగేషన్‌ శాఖ నుంచి కావాల్సిన సహకారం అందించటంతో పాటు ప్రోత్సహిస్తామని తెలిపారు.
ప్రభుత్వ నిధులతో చేపట్టే జలాశయాలపై ప్రయివేటు ఏజెన్సీలు కాకుండా ప్రభుత్వ సంస్థలైన ఆర్థిక పరిపుష్టి కలిగిన సింగరేణి సంస్థ ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ముందుకు రావటం పట్ల ప్రజలకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇందుకు సింగరేణి సంస్థను ఆహ్వనిస్తున్నామని చెప్పారు.
సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో 300 మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి పనులు మొదలు పెట్టామని ఇప్పటి వరకు 224 మెగా వాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, మిగతా 76 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయటానికి జరుగుతున్న పనులు నిర్మాణ దశలో ఉన్నాయని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌. బలరాం మంత్రులకు వివరించారు. మల్లన్నసాగర్‌, లోయర్‌ మానేర్‌ డ్యాం జలాశాయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి తయారు చేసిన ప్రణాళికల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి జలాశయాల ఉపరితలం మీద ఆరు శాతం ఉపరితలం మాత్రమే వినియోగించడం వలన మత్స్య సంపదకు ఎలాంటి నష్టం ఉండబోదని తమ ఆధ్యయనంలో వెల్లడైన అంశాలను మంత్రులకు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరి రాహుల్‌ బొజ్జా, సింగరేణి సంస్థ డైరెక్టర్‌ ఎన్‌. వి. కె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.