తూర్పు లిబియాలో వరదల బీభత్సం

Flood disaster in eastern Libya– 10 వేల మంది గల్లంతు?
–  విధ్వంసానికి గురైన తీర ప్రాంత నగరం డెర్నా
కైరో : తూర్పు లిబియాలో సంభవించిన భయంకరమైన వరదల్లో దాదాపు 10వేల మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది. తీర ప్రాంత నగరంలోని శిధిలాల గుట్టల్లో నుండి వందలాది మృత దేహాలను వెలికి తీయడంలో సహాయక బృందాలు నిమగమ య్యాయి. డెర్నా నగరంలోనే దాదాపు 2వేల మంది మరణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యధరా సముద్రంలో వచ్చిన తుపానుతో తూర్పు లిబియాలోని పలు పట్టణాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. తీర ప్రాత నగరమైన డెర్నాలో తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంది. భారీగా కురిసిన వర్షాలతో వరదలు తలెత్తాయి. పలుచోట్ల డ్యామ్‌లకు గండ్లు పడ్డాయి. అనేక పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. ఒక్కసారిగా సంభవించిన వరదల్లో 10వేల మంది వరకు ఆచూకీ తెలియకుండా పోయారని అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సమాఖ్య అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుందని తెలిపారు. ఎగువున వున్న రెండు డ్యామ్‌లకు గండి పడడంతో ఒక్కసారిగా నీటి వ్రవాహం ముంచెత్తిందని, ఆప్పుడే చాలామంది కొట్టుకుపోయి వుంటారని భయపడు తున్నట్లు తూర్పు లిబియా ప్రధాని ఒసామా హమద్‌ తెలిపారు. తమ దేశ సామర్ధ్యానికి మించిన స్థాయిలో డెర్నాలో విధ్వంసం చోటు చేసుకుందన్నారు. డెర్నాను డిజాస్టర్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు. సముద్రంలోకి పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకు పోయి వుంటాయని అనుమానిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ఆ నగరంలో చోటు చేసుకున్న విధ్వంసం దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.