– రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాజకీయాలకతీతంగా ప్రజలకు యుద్ద ప్రాతిపదికన వరద సహాయక చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. ఏజెన్సీ, ముంపు ప్రాంతాల్లో ఉన్న గర్భిణీలను గుర్తించి ఆస్పత్రులకు తరలించాలని కోరారు. పాటు కాటు, విద్యుత్ షాక్‌లకు గురైన వారికి తక్షణ వైద్య సేవలందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించి, అత్యవసర సాయం అందించేందుకు హెలికాప్టర్లు సిద్దం చేసుకోవాలన్నారు.
వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు వైద్య సేవలందించాలని కోరారు. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు, గాయపడ్డ వారికి రూ 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరమనీ, వారి కుటుంబాలకు సానుభూతి తెలియ జేశారు.