అభ్యుదయ కాలనీ ఇళ్లల్లోకి వరద నీరు

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర పంచాయతీ అభ్యుదయ కాలనీలోకి మంగళవారం ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వరదలు ఉదృతి పెరిగింది. కాలనీలో సైడ్ డ్రైన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల వరద నీరు ఇళ్లకి ప్రవేశిస్తుందని కాలనీవాసులు తెలుపుతున్నారు. అసలే వర్షాకాలం వరద నీరు ఇంట్లోకి రావడం వల్ల పాములు కప్పలు విషపురుగులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వరద నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. 12వ వార్డులో మక్కపల్లి లింగయ్య ఇంటి వద్ద వరద పరిస్థితి విపరీతంగా ఉందని ఇళ్లల్లోకి నీరు రావడం వల్ల ఇల్లు కుంగిపోయి ఆందోళన చెందాల్సి వస్తుందని తెలుపుతున్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలుపుతున్నందున అధికారులు వెంటనే స్పందించి తమను రక్షించాలని వారు కోరుతున్నారు.