ఇళ్లలోకి వరద నీళ్లు.. ఎస్సీ కాలనీవాసుల ఇక్కట్లు

– మామిడిపల్లిలో ఎస్సీ కాలనీలో 150 ఇండ్లలోకి వరద నీరు.
– సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాలనీవాసుల వేడుకలు
– సహాయ చర్యలు చేపట్టాలని అధికారులు
నవతెలంగాణ – కొనరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో మూలవాగు పక్కన ఉన్న ఎస్సీ కాలనీ లోని 150 ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీవాసులంతా రోడ్లమీదకి వచ్చి ఆందోళన చేపట్టారు. తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని మండల అధికారులకు తెలియజేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క అధికారి సంఘటన స్థలానికి చేరుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే మరో రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారని ,తమను ఎలాగైనా సురక్షితమైన ప్రాంతాలకు తరలించి మమ్మల్ని రక్షించాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మూలవాగు పక్కకు గోడ నిర్మిస్తామని హామీలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని తమకు కష్టాలు వచ్చిన సమయంలో అధికారులు కానీ పాలకులు గాని పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో పాటు విష పురుగులు, పాములు, తేలు వస్తున్నాయని చిన్నపిల్లలకు ప్రాణహాని ఉందని వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటులు చేయాలని ఎస్సీ కాలనీవాసులు అధికారులను వేడుకుంటున్నారు.