పొద్దు తిరుగుడు పూల ‘పక్షవాతం’!

'Paralysis' of flowersజంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పాలు విలపిం చగా లేంది ఈ పొద్దుతిరుగుడు పూలకు ‘పక్షవాతం’ రావ డంలో పెద్ద వింతేముంది? భజనకున్న అన్ని పరిమితులూ దాటి ముఖ్యమంత్రి కార్మిక పక్షపాతం గురించి పోగేసిన పిడికెడు మంది కార్మికులతో, అదీ గడీలోపల జైకొట్టించడం ఆశ్చర్య కరమైన సంఘటనేమీ కాదు. పైగా ఎన్నికల వేళ తమ నాయకుణ్ణి ఇంద్రుడు, చంద్రుడూ అని స్తోత్రం చేయడం కూడా సహజమే అని సర్దుకుపోవచ్చు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు అధికార పార్టీలే ఆలంబనగా అల్లుకు పోయే వలస పక్షులకు అర్థం కావాల్సిన విషయ మేమంటే కార్మికులు తేజుగుంటరు… జరపైలం!
2015లోనే జరిగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో జీహెచ్‌ఎంసీ కార్మికు లను సుమారు పదహారు వందల మందిని ముందు కోట గుమ్మానికి వేలాడదీసి, ఆ తర్వాత ముక్కు నేలకు రాయిం చి, ”బాంచను! తప్పయింది దొరా!” అని బాండ్‌ పేపర్లపై సంతకాలు తీసుకున్న విధానం చూసి ఆనాడు దేశ కార్మిక వర్గమే ఆశ్చర్యపోయింది. వంద రోజుల పైబడి ‘ఆశా’లు సమ్మె చేస్తే ప్రభుత్వం అంజాన్‌ కొట్టింది. ఆ తర్వాత కొందర్ని గడిలోకి పిలిపించుకుని ‘ఎర్రజెండాలు పట్టుకుంటే సారు ఏమీ చేయడు! బాంచనని మెకాళ్లపై కూసుంటేనే నాలుగు మెతుకులైనా విదిలిస్తాడని కొందరు రిన్‌ సబ్బుతో వాళ్ల బుర్రల్ని ఉతికి, ఆరేసి హమ్మయ్య! అనుకున్నరు. ఈ ఏడు సెప్టెంబర్‌ చివర్లో కొంగు ఎగ్గట్టిన ఆశాలు ఇరవై రోజుల పాటు అదే ఎర్ర జెండాలు చేతబట్టి పోరు సల్పిన ఘటన మన కండ్లెదుటే ఉంది. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా డైరెక్టరేట్‌ దిగ్బంధనంలో నుండి విముక్తం కావాలంటే ఎర్ర జెండాలతోనే చర్చలు జరపాల్సి రాలేదా? ఇదంతా కార్మిక పక్షపాతమేనేమో!? సర్పంచుల స్థాయి నుండి మంత్రుల స్థాయి దాకా తెగబడి అంగన్‌ వాడీలను గులాబీ రేకుల మధ్యకు ఆకర్షించే ప్రయత్నం గతం నుండి చూస్తున్నాం. అసలు సారు మీద సమ్మె కడ్తే చర్చలే ఉండవన్నది తెలంగాణలో అమల్లో ఉన్న పరమా చారం. పోరాడి తమ హక్కులే కాదు, యావత్‌ ఐ.సి.డి.యస్‌ రక్షణకై పాటుబడటం ఆ సంఘం చేసిన ‘తప్పు’ గావచ్చు. ఆ సంఘాన్ని చీల్చి చెండాడడానికి ప్రభుత్వోద్యోగుల నాయకుల్ని వాడుకున్నారు. ప్రభుత్వ అనుకూల టీచర్ల సంఘమొకటి రంగంలోకి దూకింది. మినీ అంగన్‌వాడీ లను చీల్చి ఒక ‘చెంచా’ సంఘం వెలసింది. ఇదంతా కార్మిక పక్షపాతమేనేమో!
‘గులాబీ’ భ్రమలను చీల్చుకుని అదే ఎర్ర జెండాల నీడలో సుమారు నెల రోజులు పోరాడిన అంగన్‌వాడీలు మూడు రకాలుగా అభినందనీయులు. సమ్మెలో ఉన్న వారి తో చర్చలే లేవన్న ప్రభుత్వాన్ని మెడలు వంచి ఒప్పందాని కొచ్చేలా చేయడం ఒక విషయ మైతే, ఆ రంగంలో ఐక్య పోరాటా నికి తెరలేపడం మరో కీలకాంశం. పట్టుదలగా భ్రమలకు లోను కాకుండా ప్రభుత్వ నిర్భంధాన్ని ఎదిరించి పోరాడితే ఫలితముంటుందని రుజువు చేయడం మూడవది.
ప్రభుత్వ కార్మిక ‘పక్షపాతాని’కి గొప్ప నిదర్శనం కనీస వేతనాల నిర్ణయం. నిన్న గడీలో జైకొట్టిన హోటల్‌ కార్మికు లతో సహా 73 రంగాల్లో కనీస వేతనాలు తెలంగాణ రాక ముందువే ఉన్నాయి. పదిహేను ఏండ్లుగా పెరగలేదు. ఇదే కాలంలో యాజమాన్యాల లాభాలు కోటానుకోట్ల రూపా యలు పెరిగాయి. కనీసం 2021లో విడుదలైన ఐదు జీఓ లకు సైతం అతీగతీ లేదు. నోటిఫై చేసిన వాటిని సైతం గెజిట్‌ కాకుండా యాజమాన్యాలు కోర్టుల్లో మోకాలడ్డాయి. పాపం! కార్మిక పక్షపాతికి పెట్టుబడిదారుల నొప్పే ఆయన నొప్పిగా ఉంది. రెండు సలహా మండళ్లు అయిపోయి మూడవది వెలిసింది. అన్ని కార్మిక సంఘాలూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన వాటిని కూడా మనపక్షపాతికి అమలు చేయడం సాధ్యం కావడం లేదు.
బహుశా మన రాష్ట్రంలో కాల్వల్లోకి ప్రవహిస్తునన్ని పాలు మరే రాష్ట్రంలోనూ ప్రవహించి ఉండవు. అనేక రాష్ట్ర సంఘాల్లో సమ్మెలు జరగడం, పాలాభిషేకాలు జరగడం, ఈలోగా పాలపొంగు చల్లారిపోవడం కార్మికుల సమస్య ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా నిలబడి పోవడం రివాజుగా మారింది. అలసిపోయిన కార్మికులు తమ పక్ష పాతి కరుణాకటాక్ష వీక్షణాల కోసం కన్నులు కాయలు కాసేలా ఎదురుచూడటం కూడా రివాజుగా మారింది.
తమ హక్కులు సాధించుకునే వారిగా కాకుండా, తామిచ్చే తాయిలాల కోసం ఎగబడే, ఎదురుచూసే వారిగా మార్చాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు కార్మిక పక్షపాతి గారూ! ‘అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ!’ అని పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే వారిగా కార్మికులు మిగిలిపోరు!
సమ్మెలో కార్మికులుంటే యజమానులకు అండగా పోలీసులు జోక్యం చేసుకోకుండా చూడటం కార్మిక పక్షపాతం. ప్రతి ఐదేండ్లకొకసారి కనీస వేతనాలు పెరిగేలా చూడటం కార్మిక పక్షపాతం. ఇంకా కనీస వేతనాలు అందని ఎన్నో రంగాల కార్మికులను ఆ పరిధిలోకి తేవడం కార్మిక పక్షపాతం. కార్మికుల జీతాలు పెరిగితే షేర్‌ మార్కెట్‌లోకి పోరు. ఆయా ప్రాంతాల వ్యాపారాలు పెరుగుతాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థకు చక్రాలొస్తాయి. పెట్టుబడిదారుల కడుపులు నింపితే చట్టా వ్యాపారాలు బలపడతాయి. ఈ ఆర్థిక సూత్రాన్ని అర్థం చేసుకోవడం కార్మిక పక్షపాతం.