పువ్వులు ప్రకృతి మనకందించిన ఓ గొప్ప వరాలుగా భావించవచ్చు. ఈ భూమండలం పైన సమస్త జీవరాశుల జీవన లయలకు ప్రతిబింబాలుగా, ప్రతీకలుగా ఒప్పారే సౌందర్యానందాలను అందించే మహారూపాలు రూపగుణ మేల్కలయికలు. పరీమళకాంతులు. రంగుల హరివిల్లులు.. విశ్వ మానవ సౌందర్యాత్మక చూపుకు అక్షరాలు దిద్దిన సంగీత ధ్వనులు. సౌరభాకృతుల వర్ణ సమ్మేళనాలు. కవితోద్దీపనా కేంద్రకములు. మనో వికాసహారికలు. పువ్వులు, మననవ్వులు. మానవజీవితానికి ప్రకృతి పరంగా పోల్చదగిన ఉపమానాలు. సంతోష ఆనందాలకు సంకేతాలు. శృంగార పోషణోద్ధరణా వ్యుత్ప త్తులు. భక్తి పారవశ్యాలకు అనుసంధానకర్తలు. ప్రేమాభివ్యక్తికి మధ్యవర్తులు.కడసారి వీడ్కోళ్లకు, జోహార్ల కు ఆశ్రయమిచ్చు అంజలీ పత్రములు. అలంకరణా రాజ్యానికి పట్టపురాణులు…ఇలా పూలనెన్ని విధము లైనా అన్వయించవచ్చు, వివరించవచ్చు.
ఎందుకంటే మనుషుల జీవితానికి, పూల జీవితానికి దగ్గరి సంబంధం ఉంది.పూలు పుడతాయి. గిడతాయి మనుషుల్లాగే. వాటికీ శిశు, బాల్య, యవ్వన, వృద్ధాప్య దశలూ ఉంటాయి. మనుషుల్లోని మానవతలా, పరిమళమూ ఉంటుంది. అది ఎదుటివాళ్లను ఆనందమయం గావిస్తుంది.ముద్దొచ్చే గుణం ఇద్దరిలోనూ ఉంది. భాషల కతీతంగాప్రేమను వ్యక్తం చేయగలరు. దు:ఖపు వేళలోనూ కన్నీళ్లతో పాటు పువ్వులూ విడుస్తాము. బాధల సమయాన మనతో ఉంటాయి. విజయానికి గుర్తుగా హారమై వీర గర్వాన్ని వ్యక్తం చేస్తాయి. అనుబంధాలను బంధించే సందర్భంలోనూ మన మధ్యే ఉంటాయి. మనుషుల్లోని జీవన రసస్వాదనలాగే, మధురతేనెలనందించే రసధుని కుసుమం. మనిషికి సంతో షాలతో పాటు ఇక్కట్లు ఎదురైనట్లే, పూలనంటుకునీ ముళ్లుంటాయి. చెట్టు ఆధారంగానే పువ్వు ఉనికై నట్లు, సమాజం, మనిషిని నిర్మిస్తుంది. పువ్వు సహజ లక్షణం, పరిమళాన్ని వెదజల్లడం. మనిషి సహ జంగా మానవతను అందించాలి. పువ్వేమీ దాని సహజాతాన్ని వొదలలేదు. కానీ మానవుడు మాత్రం మానవీయతను వదిలేస్తున్నాడు.
ప్రకృతిపరంగా పూలనూ స్త్రీలనూ కలపి పోలుస్తారు. కానీ పూలతత్వం మనుషులందరిలోనూ ఉంటుంది.ఉండాలి కూడా. ఇప్పుడు పూల గురించి ఎందుకు యాది చేసుకోవడమంటే బతుకమ్మ పండ గొచ్చింది. అమ్మలందరు మంచిగ బతకాలని పూలను కొలుస్తరు. స్త్రీలను కన్నీళ్లకు, కడగండ్లకు గురిచే యొద్దని పూలతో పాటలతో ఊరేగే పండుగ. సామాజిక, ప్రాకృతిక, పర్యావరణ సాంస్కృతిక వేడుక ఈ పండుగ. దీని విశిష్టత గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. కానీ పువ్వుల గురించిన భావనలను కొంత పరికించాలి. పూలలో అనేక రకాలుంటాయి. గునుగుపూలు, తంగేడు, నందివర్దనం, మల్లెలు, చామం తులు, బంతిపూలు, గులాబీలు, గడ్డిపూలు, గన్నెరుపూలు… ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఎన్నిరకాలుగా ఉన్నా, వాటికున్న పేరు పూలు. పూలన్నీ అందంగానే ఉంటాయి. వాటికి కులం, మతం ఉండదు. అన్ని మతాలూ ఆ పువ్వుల్నే వాడతారు. ప్రాంతీయ భేదమూ వాటి జోలికిరాదు. కుల కుత్సితం వాటికంటదు. రంగులన్నీ వాటి ప్రత్యేకతలు తప్ప బేదాలు, వ్యత్యాసాలు కావు. అన్ని రంగుల కలయికలే కంటగింపుగా ఉంటాయి. లౌకికత్వం వాటి సార్వజనీన విలువ. తాము పరులకు, పదుగురికి పరిమళాన్ని పంచుతు న్నామని ఏమీ హెచ్చులకుపోవు.అందాన్ని ఆనందం కోసం అందిస్తున్నామనీ అనుకోవు. తమ తమ సహజ లక్షణంగానే వ్యక్తం చేస్తాయి. కానీ మనిషి త్యాగం అనుకుంటాడు. తనవల్లే అనే అహం ఉన్న వాడు మానవుడు.
మనిషి కూడా ప్రకృతిలో భాగమే. కేవలం ఒక మెదడును అభివృద్ధి చేసుకున్నాడు. ఆలోచనను పెంచుకున్నాడు. ఊహించగలుగుతున్నాడు. మరింత ఉన్నతంగా ఉండాల్సిందిపోయి, కుంచించుకు పోతున్నాడు. స్వార్థపరుడై తన భవితనే విధ్వంసమొనరుస్తున్నాడు. ప్రకృతి పరిరక్షణలోనే మన రక్షణ ఆధారపడి ఉంటుంది. పచ్చనితనం, పూలపరిమళం లేని, ఎడారినేలలో మనిషి మనుగడ సాధించ లేడు. స్త్రీలను పూలతో పోలుస్తాము కదా మనం. ఆ స్త్రీలను మన సమానంగా, గౌరవంగా చూడలేక పోతే మనుష్యులుగా మిగలము. సమానంగా చూడకపోగా, బలహీనురాలుగా భావించి స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులు, అణచివేతలు పెరిగిపోవడం మానవ జాతికి కళంకంగా మారుతున్నది.
ప్రకృతి విధ్వంసాలతో ప్రళయాలు, ఉపద్రవాలు వెల్లువెత్తినట్లుగానే, సాటి మనుషుల పట్ల అమానవీయ దాడులు సామాజిక ఉపద్రవాలకు దారిస్తాయి. ముఖ్యంగా స్త్రీల పట్ల ఎన్నోతరాలుగా మన మెదళ్లపై ముద్రించిన అసమానతా భావాలను తుడిచివేయాలి. కుల, మత ద్వేషాలతో రగిలిపోయే అమానవీయాంశాలను మట్టుబెట్టాలి.అందరూ సమానమనే సుందర జగతికి సంకల్పం కట్టాలి. పువ్వులంత పరిమళంగా, అంతగా మానవ సమాజం వెల్లివిరియాలి!