– పరిశీలకులు, ఉపాధ్యక్షులకు రేవంత్ దిశానిర్దేశం
– 16,17,18 తేదీల్లో షెడ్యూల్‌పై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈనెల 17న తుక్కుగూడలో నిర్వహించబోయే సభకు భారీగా జనసమీకరణ చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఇన్‌చార్జీలుగా నియోజకవర్గాలను బాధ్యత తీసుకోవాలని సూచించారు.ఈమేరకు సోమవారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే, మధుయాష్కీగౌడ్, మహేష్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, ఎన్నికల పరిశీలకులు దీపదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ తదితరులు వారితో సమావేశమయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న నేతలు జనాన్ని భారీ ఎత్తున తరలించాలని కోరారు.
అందులో భాగంగా సీడబ్ల్యూసీ సమావేశాలను పురస్కరించుకుని 16,17,18 తేదీల షెడ్యూల్‌పై చర్చించినట్టు తెలిసింది. జాతీయ అగ్రనేతలు హైదరాబాద్‌కు వస్తుండటంతో వారికి సంబంధించిన బస ఏర్పాట్లు గురించి చర్చించినట్టు తెలిసింది. సీడబ్ల్యూసీ అగ్రనేతలకు తాజ్‌కృష్ణ హోటల్‌లో బస ఏర్పాట్లు, అక్కడే సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నది.
మాజీ సైనికుల సమస్యలపై పార్లమెంటులో మాట్లాడుతా : ఉత్తమ్
మాజీ సైనికులు సమస్యలపై పార్లమెంటులో మాట్లాడుతానని ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్రస్థాయి కాంగ్రెస్ మాజీ సైనికుల విభాగం ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. దేశం కోసం సైనికుడిగా పనిచేసినందుకు గర్వపడుతున్నట్టు తెలిపారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడాలనీ, కాంగ్రెస్ పార్టీ మాజీ సైనికుల శాఖను బలోపేతం చేసేందుకు పాటుపడాలని కోరారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం దేశ భద్రతకు విఘాతం కలిగిస్తోందన్నారు.