– భూముల నుంచి ఉపాధి వరకు వివరాలు సేకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో గతానికి భిన్నంగా కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకునేందుకు అప్పుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కుటుంబానికి ఉన్న అప్పులు, ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు.. ఎక్కడి నుంచి పొందారు.. లాంటి వివరాలతో పాటు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? పశుసంపద వివరాలు, రేషన్ కార్డు నెంబర్, నివాస గృహానికి సంబంధించిన వివరాలు, తాగునీటి వనరులు, వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం లాంటి వివరాలను సేకరించనున్నారు. అలాగే రోజువారి వేతనం, వార్షిక ఆదాయం, పన్ను కడితే వాటికి సంబంధించిన సమచారం, బ్యాంక్ ఆకౌంట్ డిటెయిల్స్ కూడా తీసుకోనున్నారు.వీటితో పాటు కుటుంబానికి ఉన్న భూముల వివరాలు కూడా ప్రభుత్వం సేకరించనుంది. ధరణి పాస్ బుక్ ఉన్నట్టయితే దాని నెంబర్, ఆ భూమిని ఏ రూపంలో పొందారు, భూమి ఏ రకం సంబంధించిన వివరాలను అధికారులు సేకరించనున్నారు. దీంతో పాటు.. రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రయోజనాలు ఇతర వివరాలు సేకరించనున్నారు. కుటుంబ సభ్యుల రాజకీయ నేపథ్యం, వలస కార్మికులుంటే వారి వివరాలు కూడా అధికారులు నమోదు చేయనున్నారు.