నిందలేయటం కాదురైతు సమస్యలపై దృష్టి పెట్టండి

– మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తమ పార్టీపై నిందలేయటం మానుకుని రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ తుడుచుపెట్టుకు పోతుందంటూ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఉత్తమ్‌ లాంటి సీనియర్‌ వాడుతున్న భాష, చేస్తున్న విమర్శలు ఆయన స్థాయికి తగినట్టుగా లేవని ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని చెబుతున్న కాంగ్రెస్‌ నేతలు లోక్‌ సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలంటూ ప్రశ్నించారు. గతంలో పార్లమెంటు రెండు సీట్లే ఉన్న బీజేపీ మోడీ నేతృత్వంలో పదేండ్ల పాటు అధికారంలో ఉందని గుర్తుచేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ అధికారంలో లేదు. అంత మాత్రానా ఆ పార్టీ కేంద్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాదా? అని ప్రశ్నించారు. అందువల్ల బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించటం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలనీ, కరెంటు, సాగు, తాగు నీటి సరఫరాపై సమీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్‌ కు ఆయన సూచించారు.