హార్దిక్‌పైనే ఫోకస్‌!

హార్దిక్‌పైనే ఫోకస్‌!– వాంఖడేలో కెప్టెన్‌గా తొలి పరీక్ష
– నేడు రాయల్స్‌తో ముంబయి ఢీ
ముంబయి : ఐపీఎల్‌లో విచిత్ర పరిస్థితులు చవిచూస్తున్న ఆటగాడు హార్దిక్‌ పాండ్య. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్సీ వదిలేసిన ముంబయి ఇండియన్స్‌ సారథ్య పగ్గాలు చేపట్టిన హార్దిక్‌ పాండ్య అభిమానుల నుంచి హేళనకు గురవుతున్నాడు. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లో అభిమానులు హార్దిక్‌ను హేళన చేశారు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా సొంత మైదానం వాంఖడే స్టేడియంలో హార్దిక్‌ పాండ్య నేడు తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లకు మించి వాంఖడేలో హార్దిక్‌ పాండ్యను అభిమానులు హేళన చేస్తారని అంచనాలు ఉన్నాయి.లోకల్‌ స్టార్స్‌ను కాదని పాండ్యకు సారథ్య పగ్గాలు ఇవ్వటంపై ముంబయి ఇండియన్స్‌ అభిమానులు మొదట్నుంచి ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో, రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో పరాజయం చవిచూసిన ముంబయి ఇండియన్స్‌.. నేడు సొంత గడ్డపై తొలి విజయంపై కన్నేసింది. సహజంగా ఏ సీజన్లోనైనా నెమ్మదిగా వేట మొదలెట్టే ముంబయి ఇండియన్స్‌ ఇప్పుడూ అదే చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచుల్లో ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ విజయంపై గురి పెట్టింది. కానీ రెండు మ్యాచుల్లో ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ అవకాశాలను దెబ్బతీసింది హార్దిక్‌ పాండ్యనే. అసలే అభిమానుల నుంచి వ్యతిరేకత చవిచూస్తున్న పాండ్య.. బ్యాటర్‌గా క్రీజులో అంచనాలను అందుకోవటం లేదు. ఓ వైపు అభిమానుల ద్వేషం, మరోవైపు స్వీయ వైఫల్యం హార్దిక్‌ పాండ్యను కుంగదీస్తాయా? మరింత రాటుదేలే ఇన్నింగ్స్‌ ఆడేలా చేస్తాయా? చూడాలి. రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, సహా టిమ్‌ డెవిడ్‌ ముంబయి ఇండియన్స్‌కు కీలకం కానున్నారు. జశ్‌ప్రీత్‌ బుమ్రా నుంచి ముంబయి ఇండియన్స్‌ అత్యుత్తమ ప్రదర్శన ఆశిస్తోంది. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ మంచి జోరుమీదుంది. యశస్వి జైస్వాల్‌, జోశ్‌ బట్లర్‌ ఊపందుకుంటే రాయల్స్‌కు తిరుగుండదు. సంజు శాంసన్‌, రియాన్‌ పరాగ్‌లు అర్థ సెంచరీ ఇన్నింగ్స్‌లతో ఊపుమీదున్నారు. అశ్విన్‌, చాహల్‌లు రాహల్‌ స్పిన్‌ అస్త్రాలు. పరుగుల వరద పారే వాంఖడే మైదానంలో ముంబయి ఇండియన్స్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.