మహిళలు కుటుంబంలోని అందరి కోసం అన్ని పనులు చేస్తుం టారు. కానీ వారి కోసం వారికి సమయం ఉండదు. అంద రికీ అన్ని అందిస్తూ, వారి గురించి వారు. పట్టించుకోవాలనే విషయాన్ని విస్మరిస్తారు. ఎప్పుడూ తమకంటూ ప్రాధాన్యత నిచ్చుకోరు. భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగం, లెక్కలేనన్ని ప్రాధాన్యతలు, బాధ్యతలు వారు మోస్తుంటారు. ఈ బాధ్యతలతో పాటు మహిళ తన గురించి తాను పట్టించుకోవాలి. ఇలా చేయకపోవడం వల్ల ఏర్పడే సమస్య వారు అందరితో కలిసి బయటకు వెళ్లినప్పుడు, స్నేహితులతో పార్టీలకు వెళ్లేపుడు, మేకప్ వేసుకునేపుడు తెలుస్తుంది వారు ఎంత పెద్ద వారిలా కనిపిస్తున్నామో అని. అన్ని బంధాల మధ్య తమకంటూ సమయం కేటాయించుకోని వారికి సాధారణం కంటే కొంత వయసు ఎక్కువగానే కనిపిస్తుంటుంది. చర్మం ముడతలు పడి పోతుంటుంది. దీని వల్ల పైబడిన వయసును తగ్గించుకోవడానికి కాస్త మేకప్ ఎక్కువగానే వేసుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ చర్మంపై ఉండే ముడతలు ఆ మేకప్ వల్ల పూర్తిగా తొలగిపోతాయా..? ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచగలుగుతుందా..? అంటే సందేహమే.. అందుకే మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
వయసు ప్రస్తావనకు మోహమాటం..
ఈ రోజుల్లో ఎప్పటికప్పుడు ష్యాషన్లు మారుతున్నాయి. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ మహిళలు తమ శరీరం అందుకు తగినట్టు ఉందా లేదా అని చూసుకోవాలి. అందుకోసం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. ఆహారం, వ్యాయామం వంటి వాటికి కొంత సమయం కేటాయించాలి. వీటితో పాటు సరిపోనూ నీటిని తీసుకుంటుండాలి. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం.. మహిళలు ఎన్ని విషయాల గురించి ఇతరులతో మాట్లాడుకున్నా, వయసు గురించి మాత్రం మాట్లాడడానికి ఇష్టపడరు. చాలా మంది తక్కువ వయసు ఉన్నా, వయసు పైబడిన వారిలా కనిపిస్తారు. దానిని శరీర తత్వంపై నిందలేస్తుంటారు. ఇది అందరూ చేస్తుండకపోవచ్చు. కానీ ఎలా ఉన్నాం అనే విషయాన్ని మనం శరీరంలోని రోగ నిరోధక శక్తి నిర్ణయిస్తుంది. సరైన ఆహారం తీసుకుని, వ్యాయామం చేస్తుంటే మేకప్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ పద్ధతులు పాటిస్తే యవ్వనంగా ఉండొచ్చు.
వ్యాయామాలతో మేలు..
మీరు ఇష్టపడే యోగ, పిలేట్స్, బీట్ పంప్, కిక్-బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, ఇతర ఫిట్నెస్‌కు ఉపయోగపడే దేన్నైనా ప్రయత్నించొచ్చు. వ్యాయామం మీలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని రక్త ప్రసరణను సరిగా ఉంచుతుంది. మీ శరీరాన్ని సమస్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. డాన్స్ చేయడం వల్ల కూడా శరీరం ఫిట్‌గా ఉంటుంది. ఎందువల్లంటే, డాన్స్ చేస్తుంటే శరీరంలో ఎసిటోసిన్, సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. శరీరమూ ఉత్తేజంగా ఉంటుంది. రోజువారీ చేసే వర్కవుట్‌ల కంటే డాన్స్ మనసుకు ఎక్కువ ఉత్తేజాన్నిస్తుంది. ఇందుకు తగినట్టే రోజురోజుకు కొత్త కొత్త డాన్స్ స్టెప్స్ వస్తున్నాయి. ఎప్పడూ ఏదోకటి కొత్తగా నేర్చుకుంటుండడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయి. ఫలితంగా ముడతలు తక్కువగా వస్తాయి. వీటితో పాటు ఎక్కువ నీటిని తాగాలి. రోజుకు కనీసం 1-2 లీటర్ల నీటిని తప్పనిసరి తీసుకోవాలి. వీటిని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. తాజా కూరగాయలతో పాటు పండ్లు తీసుకుంటుండాలి. వీటి వల్ల శరీరం నుంచి వ్యర్థాలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం కాంతులీనుతుంది. వీటితో పాటు ఉద్యోగం చేసే చోట, పిల్లలతో, బంధువుల వద్ద ఎక్కడ సంతోషంగా ఉంటామో ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. సంతోషంగా ఉంటే శరీరం కాంతులీనుతుంది.