
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
భావ సారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకుని, స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు దృష్టి సారించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు జిల్లా సీపీఐ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సీపీఐ పార్టీ జిల్లాస్థాయి విస్తృత నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మ లన్న జాతిపిత మహాత్మా గాంధీ మాటల్లో ఎంతో వాస్తవం దాగి ఉన్నదని, అందుకని స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు సిపిఐ పార్టీ గెలుచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూడవచ్చని, అందుకొరకు భావ సారూప్యతగల బలమైన రాజకీయ పక్షాలతో పొత్తు కుదుర్చుకొని అధిక స్థానాలు కైవసం చేసుకోవడం కొరకు వ్యూహం రూపొందించుకోవాలని ఆయన ఉద్బోధించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో వివిధ వృత్తుల్లో జీవిస్తున్న వారిని సమీకరించి ఆయా వృత్తులకు సంబంధించిన సంఘాలు నిర్మించడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజాసంఘాల నిర్మాణం బలోపేతవుతుందని తద్వారా పార్టీ బలం మరియు ఇమేజ్ పెరుగుతుందని ఆయన అన్నారు.సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీకి సిద్ధాంతమే పునాది అని, శ్రమకు తగ్గ ఫలితం లభించాలని, శ్రమ దోపిడీ లేని ఒక నూతన సమాజం నిర్మించాలనే లక్ష్యంతో, 100 సంవత్సరాలనాడు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని ఓట్లతో సీట్లతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలే అజెండాగా, దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన కార్మిక కర్షక మహిళ రైతాంగ ఉద్యమాలు నిర్వహించిన ఘన చరిత్ర సిపిఐ పార్టీది అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు దొడ్డ నారాయణరావు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యల్లావుల రాములు, మేకల శ్రీనివాసరావు యల్లంల యాదగిరి ధూళిపాళ ధనుంజయ నాయుడు, మండవ వెంకటేశ్వర్లు కంబాల శ్రీనివాస్ బద్దం కృష్ణారెడ్డి బత్తినేని హనుమంతరావు పోకల వెంకటేశ్వర్లు ఎస్కే లతీఫ్ దేవరం మల్లీశ్వరి, బూర వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు అనంతుల మల్లీశ్వరి పాల్గొన్నారు.