భద్రతపై దృష్టి పెట్టండి

–  అధికారులకు ద.మ.రైౖల్వే జీఎమ్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉన్నతస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో రైల్వే భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌జైన్‌ అన్నారు. సోమవారంనాడాయన రైల్‌ నిలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, నాందేడ్‌ డివిజన్‌లకు చెందిన డివిజనల్‌ రైల్వే మేనేజర్లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో అగ్నిమాపక పరికరాలతో సహా భద్రతా పరికరాలను పరిశీలించాలని చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ తరుచుగా కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, భద్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. రైలు కార్యకలాపాలకు సంబంధించిన రిజిష్టర్ల నిర్వహణపై జాగ్రత్త ఉండాలని అన్నారు.