పదిపై ఫోకస్.!

– ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ దృష్టి
– ప్రారంభమైన ప్రత్యేక తరగతులు
నవతెలంగాణ మల్హర్ రావు
విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి తొలిమెట్టు. ఈ మార్కులే అన్నింటికి ప్రామాణికం.ఇందులో భాగంగా విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యం నింపడంతో పాటు చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చేలా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఫోకస్ పెట్టారు.కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్నారు. అయితే కొంత మంది ఉపాధ్యాయులు మాత్రం విధులపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఇదీ పరిస్థితి..
మండలంలో ఎంఈఓ పరిధిలో తాడిచెర్ల హైస్కూల్లో 39,మల్లారం హైస్కూల్లో 14,వళ్లెంకుంట హైస్కూల్లో 07,,రుద్రారం హైస్కూల్లో 0, పెద్దతూoడ్ల హైస్కూల్లో 06, ఎడ్లపల్లిలో మోడల్ పాఠశాలలో 58, ,దుబ్బపేటలో కస్తూబ్బా ఆశ్రమ పాఠశాలలో 28,మొత్తం వీటిలో 152మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు.అయితే కొంత మంది ఉపాధ్యాయులు పిల్లల చదువుపై కాకుండా ఇతర వ్యాపకాలపై దృష్టి పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఉంటాయి.డిసెంబర్ 31వరకు సిలబస్ పూర్తి చేయాల్సి ఉంది.కొన్ని పాఠశాలల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధించి 80 శాతం సిలబస్ కూడా పూర్తి కాలేదనే విమర్శలున్నాయి. ఉపాధ్యాయుల కొరత కూడా కారణంగా తెలుస్తోంది. అయితే గత నెలలో డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కొంత ఊరట కలిగింది. సెప్టెంబర్లోనే ఉపా ధ్యాయుల సర్దుబాటు చేపట్టారు. అయితే కొంత మంది వారికి కేటాయించినా ఉన్నత పాఠశాలలకు వెళ్లి విధులు నిర్వహించలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో పాఠాలు ముందుకు సాగడం ఆలస్యమైంది.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ..
పదో తరగతి విద్యార్థులపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ రాహుల్ ధర్మ ఆదేశాలతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. చాలా పాఠశాలల్లో ఇప్పటికే ప్రారంభం కాగా, కొన్ని పాఠశాలల్లో ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. ఇటీవల విద్యా శాఖాధికారులతో పాటు ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చేలా చూడాలని ఆదేశించారు. రాత్రి, ఉదయం వేళల్లో వేకప్ కాల్స్ చేయాలని సూచించారు. తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వ హించాలన్నారు. విద్యార్థులు ఇంటి వద్ద టీవీలు, ఫోన్లకు దూరంగా ఉండేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులు ఫోకస్ పెంచారు.ఇటీవల జరిగిన ఎస్ఎ- 1 ఫలితాల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను పరిశీలించి మూడు గ్రూప్లుగా విభజిస్తున్నారు. సి-గ్రూప్ వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారు కనీసం ఉత్తీర్ణులయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇదివరకు జరిగిన పదో తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలతో ప్రాక్టిస్ చేయాలని అధికారులు ఉపాధ్యాయులకు సూచి స్తున్నారు. ఈఏడాది టాప్-10లో ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడు తున్నట్లు వారు పేర్కొంటున్నారు..
ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం….ఎంఈఓ  లక్ష్మణ బాబు…
పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఉన్నత పాఠశాలలో ఉదయం,సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభమైయ్యాయి.చదువుల్లో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాం.వందశాతం ఉత్తీర్ణత లక్ష్యం చర్యలు చేపడుతున్నాం.తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై దృష్టి సారించాలి.
రెండేళ్లలో పది ఫలితాలు….
విద్యా సంవత్సరం……ఉత్తీర్ణత….
2023-24………….98
2022-23………….95.40