పిచ్‌పైనే ఫోకస్‌!

Focus on the pitch!– సిరీస్‌ సమంపై భారత్‌ గురి
– పుణెలో ఇరు జట్ల నెట్‌ ప్రాక్టీస్‌
మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ ఆసక్తికరంగా మారింది. బెంగళూర్‌లో న్యూజిలాండ్‌ ఊహించని రీతిలో విజయం సాధించి.. ఆతిథ్య జట్టు భారత్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. బెంగళూర్‌ టెస్టు ఫలితం ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసును సైతం రసవత్తరంగా మార్చింది. భారత్‌, న్యూజిలాండ్‌ రెండో టెస్టు గురువారం నుంచి ఆరంభం కానుండగా…సిరీస్‌ సమంపై రోహిత్‌సేన కన్నేసింది. ఈ నేపథ్యంలో పుణె ‘పిచ్‌’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నవతెలంగాణ-పుణె
స్వదేశంలో టీమ్‌ ఇండియా ఒత్తిడిలో పడటం చాలా అరుదు. సొంతగడ్డపై ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఏకపక్ష విజయాలు సాధించటం భారత్‌కు పరిపాటి. బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌కు వరుస విజయాల ఊపుతో వెళ్లాలని భావించిన రోహిత్‌సేనకు న్యూజిలాండ్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్‌ కోల్పోయి భారత్‌లో అడుగుపెట్టిన కివీస్‌.. మేఘావత వాతావరణంలో టీమ్‌ ఇండియాను ఝలక్‌ ఇచ్చింది. బెంగళూర్‌ టెస్టులో మెరుపు విజయంతో న్యూజిలాండ్‌ సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తేనే సిరీస్‌ భారత్‌కు దక్కనుండగా.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులోనూ ముందంజలో నిలిచేందుకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగుతోంది. అందుకోసం పలు ముందస్తు జాగ్రత్తలు సైతం తీసుకుంటుంది.
స్పిన్‌ పిచ్‌ సిద్ధం : పుణెలో స్పిన్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం పుణెలో ప్రాక్టీస్‌ సెషన్‌కు వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌లు నేరుగా పిచ్‌ వద్దకు వెళ్లారు. అప్పటివరకు పిచ్‌పై దుప్పటి కప్పి ఉంచగా.. భారత కోచ్‌, కెప్టెన్‌ కోసం కవర్లను తొలగించారు. బీసీసీఐ చీఫ్‌ క్యూరేటర్‌ సహా లోకల్‌ క్యూరేటర్‌ సిబ్బందితో గంభీర్‌, రోహిత్‌లు సంభాషించారు. పుణెలో నల్లమట్టి పిచ్‌లు ఉన్నాయి. రెండో టెస్టు కోసం సైతం నల్లమట్టితో చేసిన పిచ్‌నే సిద్దం చేశారు. నల్ల మట్టితో చేసిన పిచ్‌ కాస్త ఎండ తగలగానే పగుళ్లు తేలుతుంది. పగుళ్లు తేలిన పిచ్‌పై స్పిన్నర్లను ఎదుర్కొవటం ఏమాత్రం సులువు కాదు. పుణె టెస్టులో భారత్‌ అవసరమైతే నలుగురు స్పిన్నర్లను సైతం బరిలోకి నిలిపే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు పుణెలో రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగగా.. రెండింటిలోనూ ఏకపక్ష ఫలితాలు రావటం గమనార్హం. భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉన్నప్పటికీ జట్టు మేనేజ్‌మెంట్‌ ఐదో స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను కోరింది. అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌, అక్షర్‌, వాషింగ్టన్‌లలో ఏకంగా నలుగురు స్పిన్నర్లు తుది జట్టులో నిలిస్తే న్యూజిలాండ్‌ బ్యాటర్లకు పరుగుల వేట గగనం కానుంది.
జోరుగా ప్రాక్టీస్‌ : రెండో టెస్టు కోసం భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు మంగళవారం జోరుగా సాధన చేశాయి. పుణె శివారు ప్రాంతంలో ఉన్న ఎంసీఏ స్టేడియంలో గత మ్యాచ్‌లో గాయపడిన రిషబ్‌ పంత్‌, గాయంతో బెంచ్‌పై కూర్చున్న శుభ్‌మన్‌ గిల్‌ నెట్స్‌లో బ్యాటింగ్‌ చేశారు. బెంగళూర్‌లోనూ గిల్‌ బ్యాటింగ్‌ చేయగా.. అక్కడ కాస్త ఇబ్బందిపడినట్టు సమాచారం. మెడ నొప్పితో బాధపడుతున్న గిల్‌ గురువారం నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం ఉంది. రిషబ్‌ పంత్‌ కీపింగ్‌ చేస్తుండగా మోకాలి గాయానికి గురయ్యాడు. పుణెలో మరో వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ గ్లౌవ్‌ పట్టుకోగా.. పంత్‌ కేవలం బ్యాటింగ్‌ మాత్రమే సాధన చేశాడు.