ఆ కేసుల పైనే దృష్టి పెట్టండి

ఆ కేసుల పైనే దృష్టి పెట్టండి– దర్యాప్తు సంస్థలకు సీజేఐ హితవు భారం పెరుగుతోందని వ్యాఖ్య
న్యూఢిల్లీ : దేశ భద్రతతో ముడిపడిన కేసులు, జాతికి వ్యతిరేకంగా జరిగే నేరాలపై మాత్రమే దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ హితవు పలికారు. సోదాలు, జప్తులకు సంబంధించిన అధికారాలకు, గోప్యత హక్కులకు మధ్య సమతూకం పాటించాలని సూచించారు. సీబీఐ రైజింగ్‌ డే సందర్భంగా ఆయన డీపీ కోహ్లీ స్మారకోపన్యాసం ఇస్తూ సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తుండడంతో నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని,
ఈ పరిణామం దర్యాప్తు సంస్థలకు సవాలుగా పరిణమించిందని చెప్పారు. ‘సీబీఐ అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థ. అయితే దాని పరిధి ఇప్పుడు విస్తరించింది. క్రిమినల్‌ కేసులను కూడా విచారిస్తోంది. దీనివల్ల సీబీఐ బాధ్యత మరింత పెరిగింది’ అని అన్నారు. చివరికి రూ.300 కంటే తక్కువ మొత్తంలో సంబంధమున్న కేసులను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థలు దేశ భద్రతకు సంబంధించిన అంశాలు, దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆర్థిక నేరాలపై మాత్రమే దృష్టి సారించాలి’ అని చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. విచారణ ప్రక్రియను డిజిటలీకరించాలని ఆయన ప్రతిపాదించారు. ముందుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో దీనిని ప్రారంభించాలని చెప్పారు. కేసుల భారం పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటే జాప్యాన్ని తగ్గించవచ్చునని అన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంపై వర్క్‌షాపులు నిర్వహించాలని, సంస్థాగత సంస్కరణలు చేపట్టాలని సూచించారు. కృత్రిమ మేథ పరిజ్ఞానాన్ని కూడా సంతరించుకోవాలని చంద్రచూడ్‌ చెప్పారు.