రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టండి 

Follow road rules and avoid accidents– తాడ్వాయి ఎస్సై ననుగంటి శ్రీకాంత్ రెడ్డి
– జాతీయ రహదారిపై మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు 
నవతెలంగాణ – తాడ్వాయి 
ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలు అరికట్టేందుకు కృషి చేయాలని తాడ్వాయి ఎస్సై ననుగంటి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మండలంలో పస్రా – తాడ్వాయి మధ్యలో 163 వ జాతీయ రహదారి పై ప్రమాదాలు అరికట్టే లక్ష్యంతో యాక్సిడెంట్ జోన్ల పరిధిలో (మూలమలుపు) వద్ద ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడ్వాయి పోలీసులు మంగళవారం ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఎస్సై  శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పస్రా, తాడ్వాయి మధ్య జాతీయ రహదారి లో అత్యంత ప్రమాదకర ఆక్సిడెంట్ జోన్లను గుర్తించి వాహన సోదరులు అప్రమత్తం చేసే నిమిత్తం ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. ప్రాణాలు చాలా విలువైనవి అని అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చున్నారు. వాహనదారులు అతివేగం ప్రమాదకరమని గుర్తించాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్లు తో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు, మైనర్ లు డ్రైవింగ్ చేస్తే బిఎన్ఎస్, ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి పోలీసులు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.