
– ఓటరు స్లిప్పుల పంపిణీ పై జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలి
– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
నవ తెలంగాణ -నల్గొండ కలెక్టరేట్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల విధులను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఎన్నికల ఎన్నికల పరిశీలకులు అజయ్ వి.నాయక్, దీపక్ మిశ్ర, ఆర్. బాలకృష్ణన్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర ఈవిఎం యంత్రాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, అవసరమైతే అదనపు బ్యాలెట్ యూనిట్లను జిల్లాకు అందించడం జరుగుతుందని, నవంబర్ 18న రెండవ దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ఓటరు నమోదు దరఖాస్తులను మూడు రోజుల వ్యవధిలో పరిష్కరించాలని అన్నారు. ఎన్నికల తనిఖీలలో నగదు, బంగారం, ఇతర ఆభరణాలు జప్తు చేసే సమయంలో ఈ.ఎస్.ఎం.ఎస్ యాప్ లో క్షేత్రస్థాయిలో వెంటనే నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రచారం సంబంధించిసమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని , ఓటరు స్లిప్పుల పంపిణీ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రారంభించాలని, జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించి ప్రతిరోజు ఓటర్ స్లిప్పుల పంపిణీ పై సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.ఈ వీడియో సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ అర్వి.కర్ణన్ జిల్లా ఎస్పీ అపుర్వా రావు, తదితరులు పాల్గొన్నారు.
నోడల్ అధికారులు,కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తో సమావేశం.
– విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులకు షోకాజ్ నోటీసులు
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ నోడల్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలోని ఆరు నియోజకవర్గాల వారిగా సెక్టార్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా అవసరమైన వాహనాలను సమకూర్చాలని అందుకు తగు వివరాలు తెలియజేయాలని ఆర్టీవోను కోరారు. సంబంధిత వాహనాలకు జిపిఆర్ఎస్, సీసీ కెమెరాల బిగింపు పై దిశా నిర్దేశం చేశారు. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్లో భాగంగా డీఈఓ ను సమగ్ర వివరాలు అందజేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై ఫామ్ 12 డి వివరాలు ఎంతమంది పోలింగ్ సిబ్బంది అందజేశారని ప్రశ్నించారు. మూడవ ట్రైనింగ్ లో భాగంగా పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు మాక్ పోల్, ఫామ్ 17 సి లోని ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు ప్రొఫార్మాలు, హ్యాండ్ బుక్ లోని సమగ్ర విషయాలపై అవగాహన కలిగించాలన్నారు. అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు అధికారులు, టేబుల్ వైస్ ఎన్ని రౌండ్స్, నియోజకవర్గం వారీగా ఎంతమంది అవసరము తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఎన్నికల మెటీరియల్ లో భాగంగా కంపార్ట్మెంట్లు కవర్లు, ప్రొఫార్మాలతో కూడిన కిట్లను ఇప్పటికే ఆర్.ఓ.లకు పంపించామని సంబంధిత అధికారి వివరించారు. ఎన్ఐసీ అధికారులు ఎలక్షన్ సెల్లో డాటా ను పూర్తిగా కంప్యూటరీకరణ చేయాలన్నారు. గ్రీవెన్స్, ఎంసీఎంసీ, ఎంసిసి, సి విజిల్, స్వీప్, ఈవీఎం మేనేజ్మెంట్, ఎక్స్పెండిచర్, తదితర విభాగాల పనులను సమీక్షించారు.ఫిర్యాదులు హెల్ప్ లైన్ విషయంలో సిపిఓ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, జనరల్ అబ్జర్లకు వసతి కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీక్ కార్డుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డి టి ఓ పరిధిలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. వెంటనే శాఖల వారీగా ఉద్యోగుల సమగ్ర వివరాలు అందజేయాలని తెలిపారు. కౌంటింగ్ హాల్స్ లో జరుగుతున్న పనుల పురోగతిపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఫైర్ ఆఫీసర్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవో ను ఆదేశించారు. పిడబ్ల్యుడి ఓటర్లకు ట్రై సైకిల్లు తదితర అంశాలపై స్త్రీ సంక్షేమ శాఖ అధికారికి తగు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిడబ్ల్యుటి ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వారిగా హెల్పర్స్ లిస్ట్‌ను ఇవ్వాలన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా మద్యం అక్రమ సరఫరా జరగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా మద్యం డంపులు ఉంటే గుర్తించాలన్నారు. బెల్ట్ షాపులు నడవకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.