– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల విధులను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఎన్నికల ఎన్నికల పరిశీలకులు అజరు వి.నాయక్, దీపక్ మిశ్ర, ఆర్. బాలకష్ణన్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో పలు సూచనలు చేశారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అర్వి కర్ణన్ జిల్లా ఎస్పీ అపుర్వా రావు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ నోడల్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలోని ఆరు నియోజకవర్గాల వారిగా సెక్టార్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా అవసరమైన వాహనాలను సమకూర్చాలని అందుకు తగు వివరాలు తెలియజేయాలని ఆర్టీవోను కోరారు. సంబంధిత వాహనాలకు జిపిఆర్‌ఎస్, సీసీ కెమెరాల బిగింపు పై దిశా నిర్దేశం చేశారు. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్లో భాగంగా డీఈఓ ను సమగ్ర వివరాలు అందజేయాలన్నారు. అలాగే ఇతర అధికారులకు తమ విధి విధానాలపై మార్గదర్శకాలు చేశారు. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ లు, అధికారులు పాల్గొన్నారు.