– నామినేటెడ్ పదవుల కోసం పోటాపోటీ యత్నాలు
– ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మెన్, డైరెక్టర్ పదవులపై గురి
– రాజకీయ నేపథ్యంపై పలువురు మంత్రులకు దరఖాస్తులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నామినేటెడ్ పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా నెలకొంది. ఎవరికి వారు పదవులు దక్కించుకోవాలని ముమ్మర యత్నాలు చేస్తున్నారు. మంత్రులు, మంత్రుల కుటుంబసభ్యులు, వారితో సాన్నిహిత్యం ఉన్నవాళ్ల చేత పైరవీలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మెన్, డైరెక్టర్ పదవుల భర్తీ ఉండటంతో ఔత్సాహికులు మంత్రులు, ఎమ్మెల్యేల మెప్పు కోసం యత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండటంతో అనుచరుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా జిల్లాకే చెందిన వారు కావడంతో ఆయన ప్రసన్నం కోసం పలువురు యత్నిస్తున్నారు. మధిర ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పాలేరు నుంచి ఎన్నికైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ నియోజకవర్గాల్లోని మధిర, మద్దులపల్లి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీల్లో తమ అనుచరులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన ఖమ్మం మార్కెట్ కమిటీలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తుమ్మల అనుచరులకే కీలక పదవులు దక్కే చాన్స్ ఉంది. ఉమ్మడి జిల్లాలోని మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో 10 మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవులను ఎవరు ‘హస్త’గతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
రాజకీయ నేపథ్యంతో దరఖాస్తులు..
మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని మార్కెట్ కమిటీ పదవులను ఇస్తారా? స్థానిక ఎమ్మెల్యేలకు పదవుల భర్తీలో ఏమేరకు ప్రాధాన్యం ఉంటుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు మార్కెట్ కమిటీల చైర్మెన్ పదవులపై ఆసక్తితో ఉన్నారు. ద్వితీయశ్రేణి నేతలు డైరెక్టర్ పదవులను ఆశిస్తున్నారు. బీసీ జనరల్, ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలకు రిజర్వ్ కావడంతో ఆ సామాజిక తరగతులకు చెందిన ఆశావహులు ప్రయత్నాల్లో వేగం పెంచారు. అర్హులైన నేతలు తమ రాజకీయ నేపథ్యం, కాంగ్రెస్ పార్టీ, సంబంధిత మంత్రి/ ఎమ్మెల్యే అనుచరుడిగా తమకున్న అనుభవాన్ని వివరిస్తూ దరఖాస్తులు చేస్తున్నారు.
మార్కెట్ కమిటీ కూర్పు.. అర్హతలు..
ఉమ్మడి జిల్లాలో 14 మార్కెట్లు ఉండగా దీనిలో ఖమ్మంలో 8, భద్రాద్రి కొత్తగూడెంలో ఆరు ఉన్నాయి. ఒక్కో మార్కెట్‌కు ఒక్కో చైర్మెన్, వైస్ చైర్మన్ పదవులు కీలకంగా ఉంటాయి. వీరు కాక మొత్తం 16 మంది సభ్యులుగా ఉంటారు. అంటే మొత్తం 18 మందితో కమిటీ ఉంటుంది. వీరిలో 12 మందిని రైతువారీగా ఎంపిక చేస్తారు. మిగిలిన ఆరుగురిలో జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయశాఖ నుంచి ఏడీ స్థాయి అధికారి ఒకరు, మండల డీసీసీబీ బ్యాంక్ అధ్యక్షులు, స్థానిక సర్పంచ్/ మున్సిపల్ చైర్మెన్/ మేయర్, స్థానిక ఎమ్మెల్యేలతో మార్కెట్ కమిటీ కూర్పు ఉంటుంది.
ముఖ్యంగా ఏ మార్కెట్ కమిటీకైతే పోటీ పడుతున్నామో సంబంధిత రైతులు ఆ మార్కెట్ కమిటీ ఏరియాలో ఎంతో కొంత వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. ఒకవేళ భూమి లేనట్లయితే కనీసం పశువులనైనా పోషిస్తున్నట్టు సంబంధిత వెటర్నరీ ఆస్పత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకుని ఉండాలి. ఉదాహరణకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పదవుల కోసం ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన వారు పోటీపడొచ్చు. అలాగే ఉమ్మడి జిల్లాలోని 14 మార్కెట్లు ఖమ్మం, పాలేరు నియోజకవర్గం మద్దులపల్లి, నేలకొండపల్లి, వైరా, మధిర బీసీ జనరల్‌కు రిజర్వయ్యాయి. సత్తుపల్లి ఎస్సీ జనరల్, ఇదే నియోజకవర్గం కల్లూరు ఓసీ మహిళకు కేటాయించారు. వైరా నియోజకవర్గం ఏన్కూరుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, దమ్మపేట మార్కెట్ల చైర్‌పర్సన్ పదవులు ఎస్టీ కోయకు రిజర్వ్ చేశారు. కాబట్టి సంబంధిత రిజర్వేషన్ కలిగివున్న మంత్రుల అనుచరుల మధ్య తీవ్ర పోటీ ఉంది. వీరిలో ఏ మార్కెట్‌లో ఏ మంత్రి మనిషికి చైర్‌పర్సన్ పీఠం దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. రైతులు, వ్యాపారుల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాల్సిన మార్కెట్ కమిటీలు ఏ మేరకు ఆ పని చేస్తాయో కానీ, పదవుల పందేరంలో మాత్రం దూసుకుపోతుండటంపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బీసీ, ఓసీకి రిజర్వ్ అయిన స్థానాల్లో ఏ సామాజికవర్గం పై’చేయి’ సాధిస్తుందనే అంశంపైనా ఆసక్తి నెలకొంది.