– 103 మంది విద్యార్థులకు అస్వస్థత
– ఈ ఏడాదిలో రెండుసార్లు.. అయినా నిర్లక్ష్యం వీడని అధికారులు,
నవతెలంగాణ-భీంగల్
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలోని కుప్పల్ రోడ్డులో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 103 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కేజీబీవీ పాఠశాలలో 272 మంది విద్యార్థినులు ఉండగా, ఎప్పటిలాగే సోమవారం రాత్రి 7 గంటలకు భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో 103 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికాగా పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సమాచారం అందించగా.. వారు హాస్టల్‌కి వచ్చి విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం విద్యార్థులను అంబులెన్స్‌లలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆస్పత్రికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్‌లకు సూచించారు. ఈ ఘటనపై మంగళవారం ఉదయం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రమేష్, డీఈవో దుర్గాప్రసాద్, ఎంపీడీవో రాజేశ్వర్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంఈఓ స్వామి, డిప్యూటీ తహసీల్దార్, రాజశేఖర్, ఎస్‌ఐ హరిబాబు.. కస్తూర్భా పాఠశాలకు చేరుకొని పాఠశాల పరిసరాలతో పాటు వంట గదిని పరిశీలించారు. భోజన నిర్వాహకులను విచారించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భయాందోళనతో పాఠశాలకు చేరుకోగా.. కోలుకున్న విద్యార్థులను వారితో ఇండ్లకు పంపించారు. కాగా, ఇదే పాఠశాలలో విద్యార్ధులను ఎలుకలు కొరికిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పట్టణ కేంద్రానికి సుదూరాన ఉన్న ఈ పాఠశాలకు పాఠశాలకు రెగ్యులర్ ప్రత్యేక అధికారి లేకపోగా, ఇన్‌చార్జి అధికారి పట్టించుకోకపోవడంతో పాటు పై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల క్రితం రెగ్యులర్ ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పజెప్పినా ఇప్పటికి చార్జ్ తీసుకోకపోవడం వీరి అలసత్వానికి నిదర్శనం.
మెనూలో మార్పే కారణమా..?
విద్యార్థులకు ప్రతిరోజూ అందించే మెనూలో మార్పు వల్లే ఘటన జరిగినట్టు అధికారులు తెలిపినట్టు సమాచారం. సోమవారం ఉదయం అల్పాహారంలో చింతపండు రసం, మధ్యాహ్నం బీరకాయ, కోడిగుడ్డు పెట్టారు. మెనూలో సోమవారం గుడ్డు లేకున్నా గుడ్డు పెట్టడంతో ఉదయం పెట్టిన అల్పాహారంతో ఫుడ్ పాయిజన్ అయినట్టు నిర్ధారణకు వచ్చారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : మంత్రి
భీంగల్ కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుకు ఆదేశించారు. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంటెండ్ ప్రతిమారాజ్‌తో మాట్లాడి విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.