‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఆస్కార్ సాధించిన తర్వాత మరోమారు ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ వస్తుందనే ఆశలు తెలుగు చిత్ర పరిశ్రమలో చిగురించాయి. 97వ ఆస్కార్ అవార్డుల్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగం కోసం మన దేశం నుంచి పంపే నామినేషన్ల జాబితాలో ఈసారి మూడు తెలుగు చిత్రాలు ‘కల్కి’, ‘హనుమాన్’, ‘మంగళవారం’ చోటు దక్కించుకోవడం విశేషం.
ఇప్పటికే కొన్ని దేశాలు తమ అధికారిక ఎంట్రీలను ప్రకటించగా మరికొన్ని దేశాలు ఉత్తమ చిత్రాలను సెలక్ట్ చేసుకునే ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. అయితే మన దేశం నుంచి అధికారిక ఎంట్రీని పంపించేందుకు షార్ట్ లిస్ట్ రెడీ చేసి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలకు చెందిన చిత్రాల స్క్రీనింగ్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘కల్కి’, ‘హను-మాన్’, ‘మంగళవారం’ సినిమాలు ఉండటం విశేషం. అలాగే తమిళం నుంచి ‘తంగలాన్’, ‘వాజై’, ‘కొట్టుకాళి’, ‘మహారాజ’, ‘జమా’, ‘జిగర్తాండ డబల్ ఎక్స్’, మలయాళం నుంచి ‘ఊళ్ళోజుక్కు’, ‘ఆడు జీవితం’, ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’, ‘ఆట్టం’, మరాఠీ నుంచి ‘స్వరగంధర్వ సుధీర్ ఫడకే’, ‘ఘాట్’, ‘ఘరత్ గణపతి’ హిందీ నుంచి ‘కిల్’, ‘ఆర్టికల్ 370’, ‘షామ్ బహదూర్’, ‘గుడ్ లక్’, ‘జోరం’, ‘యానిమల్’, ‘శ్రీకాంత్’, ‘వీర్ సవార్కర్’, ‘చోటా భమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యం’, ‘లా పట్టా లేడీస్’, ‘చందు ఛాంపియన్’ వంటి సినిమాలు లిస్టులో ఉన్నాయి.
మొత్తమ్మీద తెలుగు నుంచి 3, తమిళం నుంచి 6, మలయాళం నుంచి 4, మరాఠీ నుంచి 3, హిందీ నుంచి 11 సినిమాలు మన దేశం నుంచి పంపించే చిత్రాల జాబితాలో ఉన్నాయి. వీటిలోంచి ఓ చిత్రాన్ని ఎంపిక చేసి ఆస్కార్ నామినేషన్‌కు పంపించనున్నారు.
నేడు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇండియా నుంచి అస్కార్‌కు నామినేట్ చేసిన చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
97వ అకాడమీ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 2న జరుగుతుందని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇప్పటికే ప్రకటించింది.
97వ ఆస్కార్ అవార్డుల ఉత్తమ విదేశీ చిత్రం విభాగం కోసం మన దేశం నుంచి ఎంపిక చేసిన జాబితాలో ఉన్న తెలుగు చిత్రాలు కల్కి, మంగళవారం, హను-మాన్