ఇత్తడి వస్తువులు బంగారంలా మెరుస్తూ.. ఇంటికి స్పెషల్లుక్ తీసుకొస్తాయి. అయితే ఇవి చూడటానికి అందంగా ఉన్నా.. వీటిని మెయింటేన్ చేయడమే కష్టం. గాలికి త్వరగా నల్లగా మాసిపోయినట్టుగా కనిపిస్తాయి. కొందరు వీటిని శుభ్రం చేయలేక.. వాడటం మానేస్తుంటారు. అయితే సులభమైన చిట్కాలతో ఇత్తడి వస్తువులను తళతళా మెరిపించవచ్చు. ఆ టిప్స్ ఏమిటో చూద్దాం.
వేడి నీళ్లు, వెనిగర్: కొన్ని నీళ్లు మరిగించి దానిలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలపండి. దీన్ని రెండు నిమిషాల పాటు ఆలాగే ఉంచి ఆ తర్వాత.. దానిలో కాటన్ క్లాత్ ముంచి పాత్రలను రుద్దండి. ఆ తర్వాత మైల్డ్ డిష్ సోప్‌తో ఇత్తడి వస్తువులను తోమండి. దీన్ని నీళ్లతో శుభ్రం చేసి పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టండి. ఇలా చేస్తే ఇత్తడి పాత్ర మిలమిల మెరుస్తుంది.
చింతపండుతో: ముందుగా ఇత్తడి పాత్రను నీటితో తడిపి చింతపండు గుజ్జుతో తోమండి. ఆ తర్వాత మైల్డ్ డిష్ సోప్‌తో మరోసారి తోమండి. తర్వాత గోరవెచ్చని నీళ్లతో శుభ్రం చేసి పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టండి. ఇలా శుభ్రం చేస్తే ఇత్తడి వస్తువులు బంగారంలా మెరుస్తాయి.
నిమ్మరసం, పిండితో: ఇత్తడి పాత్రలపై కొద్దిగా వరిపిండి వేసి, నిమ్మరసం చిలకరించండి. ఆ తర్వాత బాగా స్క్రబ్ చేయండి. దీన్ని నీళ్లతో శుభ్రం చేసి మెత్తటి వస్త్రంతో శుభ్రంగా తుడిచి ఆరబెట్టండి.
సున్నం, ఉప్పు: ఇత్తడి పాత్ర మీద కొద్దిగా సున్నం, ఉప్పు వేసి దాని మీద వెనిగర్ పోయాలి. వంట గది స్క్రబ్బర్ తీసుకుని సున్నితంగా స్క్రబ్ చేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకుని ఆరబెట్టేస్తే సరిపోతుంది.
నిమ్మరసం, ఉప్పు: నలుపెక్కిన ఇత్తడి పాత్రలను నిమ్మచెక్కకు కళ్లుప్పు అద్ది రుద్దండి. తర్వాత నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా శుభ్రం చేస్తే తళతళ మెరుస్తాయి.
టమాటా కెచప్‌తో: మూడు చెంచాల టొమాటో సాస్కి కాస్త బేకింగ్ సోడా కలిపి రుద్దేయండి. తర్వాత చల్లటి నీటితో కడిగి పొడి వస్త్రంతో తుడిస్తే తళతళలాడతాయి. మరకలు పడకుండా ఉంటాయి.