కాంగ్రెస్‌ గూటికే…

– రాహుల్‌, ఖర్గేతో పొంగులేటి, జూపల్లి భేటీ
– ‘కేసీఆర్‌కో హటావో.. తెలంగాణకో బచావో’ నినాదంతో ముందుకు…: కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ సూచన
– జులై 2న ఖమ్మం సభలో పొంగులేటి చేరిక
– 14 లేదా 16న మహబూబ్‌నగర్‌ సభలో జూపల్లి చేరిక
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. అరగంటకుపైగా రాహుల్‌తో చర్చించారు. జులై 2న ఖమ్మం రావాలని రాహుల్‌ని పొంగులేటి ఆహ్వానించారు. దీంతో ఆ రోజు ఖమ్మంలో జరిగే సభలో రాహుల్‌ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అలాగే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో కూడా వారు భేటీ అయ్యారు. రాహుల్‌తో జరిగిన భేటీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఇంఛార్జి ఠాక్రే తదితరులు ఉన్నారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మరో 33 మంది కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ జాబితాను తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే విడుదల చేశారు. నేతలు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా ‘కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో ముందుకు సాగాలని తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణులకు రాహుల్‌ సూచించారు. తెలంగాణ నేతలతో రాహుల్‌ భేటీ సందర్భంగా ఫొటో సెషన్‌ ఏర్పాటు చేశారు. నేతలంతా గ్రూప్‌ ఫొటో దిగిన అనంతరం రాహుల్‌తో కలిసి పొంగులేటి మరోసారి ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి, జూపల్లి అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పదవులు ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు రాలేదని, బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకే బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వెల్లడించారు. అయినా తనకు పదవులు ముఖ్యం కాదనీ, పదవుల కంటే ఆత్మాభిమానమే ముఖ్యమని అన్నారు. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించానని, పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ కూడా చేసినట్టు వివరించారు. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని పరిస్థితులపై కూడా సర్వే చేయించానన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపే కేంద్రీకృతమైందని వెల్లడించారు. కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగి, బీజేపీ పరిస్థితి దిగజారిందని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్‌ కొత్త స్కీములు పెడతారని, గారడి మాటలు చెప్పడంలో ఆయన సిద్ధహస్తులు అని పేర్కొన్నారు. మూడోసారి మాయమాటలతో ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్‌ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కానీ తెలంగాణ బిడ్డలు కోరుకున్నది మాత్రం ఇంకా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారనేది పరిశీలించాం.. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోల్పోయారని పొంగులేటి వెల్లడించారు.
జూలై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు పొంగులేటి స్పష్టం చేశారు. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేతలను ఆహ్వానించినట్టు తెలిపారు.
మూడోసారి పరిపాలించే నైతిక హక్కు లేద్ణు జూపల్లి
బీఆర్‌ఎస్‌ మూడోసారి పరిపాలించే నైతిక హక్కు కోల్పోయిందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్‌వి అన్ని బోగస్‌ మాటలు అని మండిపడ్డారు. ఆయన పరిపాలన చూశాక ప్రజలకు అంతా అర్థమైందని చెప్పుకొచ్చారు. సోనియా రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలకు అవకాశం వచ్చిందనీ, ఇది అందరి బాధ్యత అని గుర్తుచేశారు. కేసీఆర్‌ మాటలు నమ్మొద్దని కోరారు. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ రుణం తీర్చుకోవాలని ప్రజలకు జూపల్లి విజ్ఞప్తి చేశారు.
తొమ్మిదేండ్ల కేసీఆర్‌ పాలనలో ప్రజాస్వామ్యం పాతాళానికి పోయిందనీ, అవినీతి ఆకాశానికి అంటిందని విమర్శించారు. నూటికి నూరు శాతం ప్రజలను మోసం చేసే దుర్మార్గ పాలన కేసీఆర్‌ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ అంబేద్కర్‌ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు.
సోనియా రుణం తీర్చుకోక పోతే దేవుడు కూడా క్షమించడని వ్యాఖ్యానించారు. వచ్చే నెల 14 లేదా 16వ తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగే సభలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు జూపల్లి స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లోకి ఈటల, రాజ్‌గోపాల్‌ రెడ్డి?
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తోపాటు, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్‌రెడ్డి ఆగస్టు మొదటివారంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. వారి చేరికపై ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు తెలుస్తున్నది.