నాలుగేళ్లుగా ప్రతిసారి సమస్యల పరిష్కారం ఏది..? 

– ప్రతి విషయం దృష్టికి తెచ్చిన ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకుండానే పదవి నుండి దిగిపోతున్నం..
– మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీల అవేదన..
– మిషన్ భగీరథ లీకేజీలను సరి చేయండి..
– మండల సమావేశానికి రాని అధికారులపై చర్యలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
నాలుగున్నర ఏళ్ల లో ప్రతి సారి నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం లో ఆయా గ్రామాలలో నేలలోని ఉన్న సమస్యలను  ప్రతిసారి దృష్టికి తెచ్చినప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకుండానే తాము ఎంపీటీసీ పదవి నుండి దిగిపోవాల్సి వస్తుందని, గ్రామాల్లో మిషన్ భగీరధ పైపు లీకేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీరందించాలని మండల ఎంపీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీపీ ఎంపీపీ నర్సయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశం లో అమృతాపూర్ ఎంపీటీసీ ఒడ్డె సాయిలు, సాంపల్లి ఎంపీటీసీ బిక్యానాయక్  మాట్లాడుతూ గ్రామాల్లో మిషన్ భగీరథ లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో తాగునీరు సరిగ్గా అందడం లేదని ఆరోపించారు. అమృతాపూర్లో ట్యాంకులకు కనెక్షన్లు ఇచ్చారే తప్ప కొత్తగా మిషన్ భగీరథ నల్లాల ద్వారా నీరందించడం లేదన్నారు.ప్రతిసారి అనేక సమస్యలు దృష్టికి తెచ్చినప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకుండానే తాము పదవి నుండి దిగిపోవాల్సి వస్తుందని ఎంపీటీసీలు అవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైన తక్షణమే ప్రత్యేక దృష్టి పెట్టి త్రాగునీటి సరఫరాను పరిష్కరించాలన్నారు. వానకాలం సీజన్ ప్రారంభమైన దృష్ట్యా ఇప్పటికీ జీలుగ విత్తనాలు అందుబాటులో లేవని, సీజన్ ముగిసిన తర్వాత విత్తనాలు ఏమి అవసరమని, తక్షణమే జీలుగ విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు. ఎన్నికల కోడ్ మూలంగా జీలుగ విత్తనాలు సరఫరా కాలేదని, త్వరలోనే జీలుగ విత్తనాలు అందుబాటులో ఉంచుతామని ఏఈఓ భావన సభ దృష్టికి తెచ్చారు. గ్రామాల్లో ఆంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదని సభ్యులు సభ దృష్టికి తేగా అంగన్వాడీ సూపర్వైజర్ స్పందిస్తూ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నానని బదులిచ్చారు. ఎంపీడీఓ రవీందర్ కల్పించుకుని మాట్లాడుతూ తాను ఏ గ్రామంకు వెళ్లిన అంగన్వాడీ కేంద్రాలను తరచూ తనిఖీ చేస్తున్నామని, అక్కడ పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందడం లేదన్నారు. ఇక నుంచి క్షేత్రస్థాయిలోని అంగన్వాడీ కేంద్రాలను సూపర్వైజర్లు తనిఖీలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎంపీడీఓ సూచించారు. మూడు నెలలకోకసారి జరిగే సర్వసభ్య సమావేశాలకు హాజరు కానీ మండల డివిజన్ స్థాయి అధికారులపై జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఎంపీడీఓ పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య. ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఎంఈఓ రాజగంగారాం, గురుకుల విద్యాలయ జిల్లా కోఆర్డినేటర్ సంగీత, ఆంగన్వాడీ సూపర్వైజర్లు, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.