న్యాయం కోసం

For justiceన్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన వత్తి జీవితంలో చవిచూసిన పక్షపాత ధోరణులను- పోలీస్‌ స్టేషన్లలో, కోర్టుల్లో నలిగిపోతున్న జీవితాలను బట్టబయలు చేస్తూ రాజేందర్‌ ‘జింబో’ రాసిన కథల సంపుటియే ”నేను… నా నల్లకోటు”.
పోలీసు, న్యాయవ్యవస్థ, రాజ్యంలోని అవకతవకలు, అన్యాయాన్ని వివరిస్తూ కథలు రాయడం సాహసమేనని చెప్పాలి. కటువైన నిజాలను బాహాటంగా తెలియజేసి లేనిపోని చిక్కులను ఎదుర్కోవడం కంటే, వాటిని హాస్య వ్యంగ్యరీతిలో, కొన్నిసార్లు అలిగరీ పద్ధతిలో రాసి పాఠకులను ప్రభావితం చేసే పద్ధతిని రచయిత ఎంచుకున్నారు. ఇందులో చాలా కథలు చందమామ కథలుగా, బేతాళ కథలుగా, గాడిద కథలుగా, చివరకు నీతి బోధకాలుగా తీర్చిదిద్దడంలో మంచి వ్యంగ్యాన్ని పోషించగలిగారు.
నగరంలో ఫ్లెక్సీలు వేలాడదీయరాదని మున్సిపాలిటీ వారి ఆదేశం. అయినా అన్ని రాజకీయ పార్టీలు, చివరకు వీఐపీలు కూడా నగర సందర్శనానికి వస్తే చాలు, ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వేలాడదీసి నానా హంగామా చేస్తుంటారు. పర్యావరణం గురించి ఎవరు పట్టించుకోరు. మనుషులకు రాహుకాలం, వాస్తు పట్ల పిచ్చి పెరిగిపోతున్న రోజుల్లో, కోర్టు కేసులకు వీటిని వర్తింప చేస్తే అసలుకే మోసం వస్తుందని ఒక కథ తెలియజేస్తుంది. మేధావులని గుర్తించి ఇచ్చే గౌరవ డాక్టరేట్ల ప్రహసనం గురించి ఒక కథ, మేధావుల్లో పెరిగిపోతున్న సన్మానాల మోజు మీద విసురు ఇంకో కథలో కనిపిస్తుంది. మనుషుల్లోనే ప్రేమ, బాధ ఇతరుల పట్ల కన్సర్న్‌, క్రమంగా క్షీణిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తారు.
రాజరికాలు పోయినా ప్రజాస్వామ్య ముసుగులో రాజ్యపాలన కొనసాగుతూనే ఉన్నది. రాజ్యానికి చేరువ కావడం కోసం, అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. ఉద్యోగులు, పై అధికారులను కాకా పట్టడానికి కాళ్లు మొక్కడం మామూలై పోతున్న సందర్భంలో- ఐఏఎస్‌ అధికారులు కూడా రాజకీయ నాయకులకు పాదాభివందనం చేయడం వారి విధేయతకు, లొంగుబాటుతనానికి చిహ్నం కాదా? ఇది న్యాయవ్యవస్థలోకి కూడా ప్రవేశించిందంటే ఆశ్చర్యమే. ఉద్యోగుల్లో ఉండే బానిస మనస్తత్వానికి న్యాయాధికారులు కూడా మినహాయింపు కాకపోవడం విచారకరం. అధికారులు, ఉద్యోగుల్లో పెరిగిపోతున్న అధికారలాలస, పదవీ వ్యామోహాన్ని ఇందులో చాలా కథలు చిత్రీకరించాయి. పదవీ విరమణ చేసిన తర్వాత కలిగే భ్రమలు- చిత్తభ్రాంతులను ఇంకో కథలో వివరించిన విధానం బాగుంది. తమ బాధలను తమ కష్టాలని చెప్పుకోలేని వ్యక్తులను అర్థం చేసుకున్నవాడే మంచి నాయకుడు అవుతాడు. అట్లాగే మంచి న్యాయమూర్తి అవుతాడని నిర్ధారిస్తున్నారు.
ఎవరైతే మన పాలనని విమర్శిస్తున్నారో, అందులో ముఖ్యులను ఎంపిక చేసి, బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లను కూల్చివేస్తే మిగతావాళ్లంతా చచ్చినట్టు పడి ఉంటారని పాలకవర్గాలు అనుకోవడంలో ఆశ్చర్యమేమున్నది. రాజ్య వ్యవస్థను సవాలు చేసే పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఉండడాన్ని సహించలేని ప్రభుత్వాలు ప్రజాకోర్టుల్లో న్యాయమూర్తి ఎంపిక జరగడాన్ని నిలిపివేస్తూ, న్యాయాధికారుల బదిలీల్లో జాప్యం చేస్తూ, న్యాయస్థానాల పనితీరును నియంత్రిస్తూ, ప్రజాస్వామ్య ప్రమాణాలకే అడ్డుకట్ట వేస్తున్న తీరును వివరించిన తీరు ప్రశంసనీయం. ధనవంతులకు, రాజకీయ నాయకులకు అర్ధరాత్రి పూట లేదా సెలవు రోజుల్లో కూడా బెయిల్‌ సులభంగా దొరుకుతుంది. సామాన్యులకు అది అసంభవం మరి. న్యాయం కూడా ఉన్నవాడికి ఒకలా, లేని వాడికి మరొకలా వ్యవహరించడం కనిపిస్తూనే ఉంది. డబ్బులతో ఓట్లను కొనడం తప్పని తెలిసినా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. చివరకు ఎలక్షన్‌ కమిషన్‌ కూడా నిస్సహాయంగా ఉండిపోతుంది.
రూల్‌ ఆఫ్‌ లా అంటే చట్టం ముందు అంత సమానమే. కానీ ఇది ఉన్నవాళ్లకు ఒకరకంగా, లేని వాళ్లకు ఇంకో రకంగా అమలుపరుస్తుంటారు. ప్రభుత్వ వ్యవస్థలో తమ స్వార్థం, ప్రయోజనాల కోసం రూల్‌ ఆఫ్‌ లా ను ఎలా వాడుకుంటారో ఒక కథలో తెలియ జేశారు. జైల్లో ఉన్న కేసులకే అతీ గతి లేదు. మాసాల కొద్ది తీర్పుల కోసం ఎన్నో కేసులు పెండింగ్‌ లో ఉన్నాయి. ఇక కొత్తగా కేసు వేస్తే ఎవరు పట్టించుకుంటారు. ఏండ్లు పూండ్లు గడిచిపోయినా న్యాయం దొరకదు. దొంగలు -పోలీసుల మిలాఖత్‌ గురించి అనేక కథనాలు వ్యాప్తిలో ఉండడం మనకు తెలిసిన విషయమే. కేసు నిలవదని తెలిసినా ఫైలు కింది నుండి పైకి తిరిగి, ముద్దాయిలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. న్యాయం జరపడం కోసం కాదు. మనుషులను వంచడం కోసమే కేసులు పెడతారు. కాలానుగుణంగా నేరాలు- చట్టాలు మారిపోతుంటాయని ఇంకో కథలో తెలియ జేస్తారు. హాస్య వ్యంగ్య ధోరణిలో చిత్రీకరిం పబడిన ఈ కథలన్నీ పాఠకుల్ని ఆలోచింప జేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
– కె.పి అశోక్‌ కుమార్‌