– ముందు విధిగా గ్రామసభ : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
షెడ్యూల్డ్ ఏరియాల్లో భూసేకరణ నోటిఫికేషన్లను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. షెడ్యూల్ ప్రాంతాల్లో భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు విధిగా గ్రామసభ అనుమతి పొందాలన్న నిబంధనను అధికారులు అమలు చేయలేదని తప్పపట్టింది. షెడ్యూల్ ఏరియా భూసేకరణ చట్టంలోని సెక్షన్ 41(3) ప్రకారం గ్రామసభ తప్పనిసరని తీర్పు చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, సమితి సింగారం గ్రామాల్లో రైల్వేలైన్ నిమిత్తం చేపట్టిన భూసేకరణకు గ్రామసభ అనుమతి పొందకపోవడాన్ని తప్పుపట్టింది. అదే విధంగా మేడారంలో వీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణం నిమిత్తం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్, దిండి ప్రాజెక్టు నిమిత్తం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లిలోని ఒక తండాలో భూసేకరణకు ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ ఇటీవల వేర్వేరు తీర్పులు చెప్పారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామసభ అనుమతి లేకుండా భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లను అనుమతిస్తూ తీర్పు చెప్పారు.