– కుటుంబపెన్షన్‌ను 30 శాతం పెంచాలి
– పింఛనుదారులందరికీ ఒకే డీఏ ఇవ్వాలి : కేంద్ర మంత్రిని కలిసిన సీపీఐ(ఎం) ఎంపీ బ్రిట్టాస్, ఎఐఐపీఏ నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీమా సంస్థల పింఛనుదారులు కుటుంబ పెన్షన్‌ను 30 శాతం పెంచాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ (ఎఐఐపీఏ) కోరింది. ఈ మేరకు బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, ఎఐఐపీఏ నేతలు కలిసి వినతిపత్రం సమర్పించారు. లైఫ్, జనరల్ రెండింటిలోనూ పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ సంస్థల పెన్షనర్లను ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన సమస్యలను ఆమెకు వివరించారు. కుటుంబ పెన్షన్‌ను ఏకరీతిగా 30 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. తాము ఎల్‌ఐసీ, ఇతర పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో అత్యధిక సంఖ్యలో పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, అత్యుత్తమ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా ఎల్‌ఐసీని నిర్మించేందుకు తమ వంతు కృషి చేశామని చెప్పడానికి గర్వపడుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. సేవల నుంచి పదవీ విరమణ చేసిన తరువాత కూడా, తాము తమ ప్రచారం ద్వారా ఈ సంస్థల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఎల్‌ఐసీ, పీఎస్‌జీఐ సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషించడానికి నిబద్ధతగా పని చేసే ఉద్యోగులే కారణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ, ఆర్‌బీఐలో పెన్షన్ పథకాలతో వచ్చే ప్రయోజనాలు ఎల్‌ఐసీ, పీఎస్‌జీఐ సంస్థల నుంచి పెన్షనర్లకు అందడం లేదని తెలిపారు. ఆ కంపెనీల్లో కుటుంబ పెన్షన్ చెల్లింపులో 15 శాతం ఉండగా, కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలో దీనిని 30 శాతానికి పెంచారని వివరించారు. ఈ ప్రయోజనం ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా విస్తరించిందని తెలిపారు. అయితే ఈ ప్రయోజనం బీమా ఉద్యోగులకు వర్తించటం లేదని చెప్పారు. 2019 సెప్టెంబరు నాటికి కుటుంబ పెన్షన్‌ను ఏకరీతి రేటు 30 శాతానికి పెంచాలని ఎల్‌ఐసీ బోర్డ్ సిఫారసు చేసిందని, జనరల్ ఇన్సూరర్స్ పబ్లిక్ సెక్టార్ అసోసియేషన్ (జీఐపీఎస్‌ఎ) పాలకమండలి కూడా 2021 డిసెంబర్‌లో సిఫారసు చేసిందని తెలిపారు. అప్పటి నుంచి ఆర్థిక శాఖ ఆమోదం కోసం సిఫారసులు పెండింగ్‌లో ఉన్నాయని, అయితే ఈ కాలంలో గణనీయమైన సంఖ్యలో కుటుంబ పెన్షనర్లు మరణించారని తెలియజేశారు. ప్రస్తుతం అందుతున్న కుటుంబ పింఛను సరైన జీవన ప్రమాణాలను నిర్వహించడానికి సరిపోవడం లేదని, చాలా మంది కుటుంబ పింఛనుదారులు ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని తెలిపారు. అందువల్ల, ఈ సంస్థలు చేసిన సిఫార్సుల ఆమోదం కోసం వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, కుటుంబ పెన్షనర్లకు సహాయం చేయాలని కోరారు. పింఛనుదారులు, కుటుంబ పింఛనుదారులందరికీ డియర్నెస్ అలవెన్స్ (డీఏ) ఏకరీతి రేటు చేసే ఒక ఫార్మూలాను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు సానుకూలంగా పరిగణించాలని కోరారు.