అలాంటి ఫ్యామిలీ స్టార్స్‌ కోసం..

అలాంటి ఫ్యామిలీ స్టార్స్‌ కోసం..హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా మరో నాలుగు రోజుల్లో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ, ‘ఈ సినిమా విషయంలో ప్రతి అంశం పాజిటివ్‌గా కనిపిస్తోంది. పాటలు, ట్రైలర్‌ మీరు చూశారు మీ అందరికీ నచ్చింది. అందుకే మీలోనూ ఆ హ్యాపీనెస్‌ కనిపిస్తోంది. పరశురామ్‌ ఈ కథ చెప్పగానే అందులోని పాయింట్‌ నన్ను ఎగ్జైట్‌ చేసింది. విజరు, పరశురామ్‌ కలిసి ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ చేశారు. ఈ సినిమా కూడా వాళ్ల కాంబినేషన్‌లో సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఫ్యామిలీ స్టార్‌కు విజరు క్యారెక్టరైజేషన్‌ వెన్నెముక లాంటిది. విజరు నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఫైట్‌ చేస్తాడు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెను ద్వేషిస్తాడు, రొమాన్స్‌ చేస్తాడు..ఇలా అన్ని షేడ్స్‌ హీరో క్యారెక్టర్‌లో ఉన్నాయి. ఇది కేవలం ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు లవ్‌ స్టోరీ కూడా ఉంటుంది’ అని తెలిపారు.
”సీతారామం’ సినిమాకు వర్క్‌ చేస్తున్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు ఇంత గొప్ప కెరీర్‌ ఉంటుందని అనుకోలేదు. ఆ సినిమా తర్వాత ‘హారు నాన్న’ వంటి మంచి స్క్రిప్ట్‌ దొరికింది. ఈ రెండు సినిమాల తర్వాత నేను చేసే సినిమాలు స్పెషల్‌గా ఉండాలని అనుకున్నా. అలాంటి స్పెషల్‌ స్కిప్ట్‌ను పరశురామ్‌ నెరేట్‌ చేశారు. గోవర్థన్‌, ఇందూ, బామ్మ ఇతర క్యారెక్టర్స్‌ మధ్య బ్యూటిఫుల్‌గా స్టోరీ ఉంటుంది. మన జీవితం అర చేతిలాంటిది. మన వేళ్లలాగే జీవితంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. కొన్నిసార్లు మన ప్రొఫెషనల్‌ లైఫ్‌ చాలా బాగుంటుంది, కానీ పర్సనల్‌ లైఫ్‌లో సమస్యలు ఉంటాయి. మన జీవితాల్లోని ఎమోషన్స్‌, రిలేషన్స్‌, అఛీవ్‌ మెంట్స్‌, స్ట్రగుల్స్‌ అన్నీ ఈ మూవీలో మీరు రిలేట్‌ చేసుకుంటారు. మనల్ని ఎంకరేజ్‌ చేసి ముందుకు నడిపించేవారు కుటుంబంలో ఎవరో ఒకరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారిని గుర్తుచేసుకునే ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమా సైన్‌ చేసినప్పుడు నేను మా నాన్నతో ఈ సినిమా నీకోసమే చేస్తున్నానని చెప్పా. దర్శకుడు పరశురామ్‌ ఇందు క్యారెక్టర్‌ను చెప్పినప్పుడు నేను పోషించగలనా లేదా అని భయపడ్డాను. కానీ విజరు ఎంతో సపోర్ట్‌ చేశాడు’ అని కథానాయిక మృణాల్‌ ఠాకూర్‌ చెప్పారు.
‘మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నేనున్నా అని ధైర్యం చెప్పే పర్సన్‌ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్‌. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్‌. డైరెక్టర్‌ పరశురామ్‌ ఈ కథ చెప్పినప్పుడు ఆయన లైఫ్‌ లోని అనుభవాలను ఊహించు కుంటూ చెప్పాడు. కథ వింటున్నప్పుడు మాత్రం నాకు మా నాన్న గుర్తొచ్చాడు. ఫ్యామిలీ కోసం ఆయన పడిన తపన గుర్తుకువచ్చింది. అందుకే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు గోవర్థన్‌ అనే పేరు పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఎమోషన్స్‌ పలికించడం సులువు అవుతుంది. ఈనెల 5న ఫ్యామిలీ స్టార్‌ రిలీజ్‌ అవుతోంది. 8న నాన్న బర్త్‌ డే. ఈ సినిమా విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నా’.
– హీరో విజయ్ దేవరకొండ