సనాతన ధర్మంపై మాట్లాడినందుకే…

On orthodoxy For talking...– ఉదయనిధి స్టాలిన్‌ను టార్గెట్‌ చేశారు : కమల్‌హాసన్‌
కోయంబత్తూర్‌ : సనాతన ధర్మంపై తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం స్టాలిన్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యిమ్‌ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ స్పందించారు. సనాతన ధర్మంపై మాట్లాడినందుకే ఉదయనిధి స్టాలిన్‌ను బీజేపీ టార్గెట్‌ చేసిందని అన్నారు. కోయంబత్తూరులో జరిగిన పార్టీ సమావేశంలో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ‘సనాతన ధర్మంపై మాట్లాడినందుకే బీజేపీకి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్‌ టార్గెట్‌ అయ్యారు. సనాతన ధర్మం గురించి గతంలో ఉదయనిధి తాత, డీఎంకే నేత ఎం. కరుణానిధితోపాటు పలువురు నేతలు మాట్లాడారు’ అని గుర్తుచేశారు. అలాగే తమిళ దిగ్గజ నేత పెరియార్‌ వి.రామస్వామిని కూడా కమల్‌ గుర్తు చేసుకున్నారు. సామాజిక రుగ్మతలపై వి.రామస్వామికి ఎంత కోపం ఉండేదో ఆయన జీవితం నుండే మనం అర్థంచేసుకోవచ్చు. పెరియార్‌ లాంటి నాయకుడి వల్లనే తనలాంటి వారు సనాతన అనే పదాన్ని అర్థం చేసుకున్నారని చెప్పారు. పెరియార్‌ ఆలయ నిర్వాహకుడిగా ఉన్నప్పుడు కాశీలో పూజలు కూడా చేశారు. అయితేనేం.. ఆయన జీవితమంతా ప్రజలకు సేవ చేయడానికే అంకితం చేశారని కమల్‌ అన్నారు. పెరియార్‌ తమకు మాత్రమే చెందినవాడని అధికార పార్టీ డీఎంకే లేదా మరే ఇతర పార్టీ వాదించదు. తమినళనాడు రాష్ట్రం ప్రజలందరూ ఆయనను తమ నాయకుడిగా చూస్తారని, గౌరవిస్తారని.. తాను కూడా వ్యక్తిగతంగా పెరియార్‌ని గౌరవిస్తానని కమల్‌ అన్నారు.