అడవిలో పూచిన
మోదుగు పూవు లాంటి అతను
కలల పొరలలోని చేదు వాస్తవాలను
ఆకళించుచుకున్న వైదుష్యం లాంటి అతను
నెత్తురు సంతకం చేసిన
కళను తను ఎత్తి పట్టిన కత్తితో
ఆవాహన చేసుకున్న అతను
అదిగో ఒక నిశిరాత్రి
ఆ మూల మలుపు దగ్గరే
ఆ అరణ్యం కొండచిలువ
నోటిలోకే అతిసామాన్యంగా దూరిపోయాడు.
ఆ క్షణం అతని మొహంలో
మెరిసిన ఉదయాలను నేనసలు మరచి పోలేను
అట్లా ఎర్రటి సంధ్యనంతా
దేహంనిండా పులుముకొన్న అతను
తిరిగివస్తాడని పొగడపూల
దారినిండా అలంకరణ చేశాను
చెల్లా చెదురై గాలిలో ఎగురుతున్న అక్షరాలను
పిల్లంగ్రోవిలో ఊదుతున్నాను
అదశ్యంగా జ్వలించే అగ్నిని
కల కన్నుతో ఆవాహన
చేసుకున్నాను ఆకాశాన్ని భూమిని
కలిపే గాలితరంగాన్నై
నేనొక స్వాగతం కల కంటున్నాను.
కానీ క్రమంగా నా కర్ధం అయింది
ఇది తెల్లారని రాత్రి
ఇది ఉపశమించని దుఃఖం
అతని పునరాగమనం నాకో సుదీర్ఘ స్వప్నం
ఎడ తెరిపి లేని ఈ జీవిత కాలపు
యుద్ధానికి నన్ను
నేను సంకేతం చేసుకుంటాను.
డా|| కాంచనపల్లి గోవర్ధన్ రాజు, 9676096614