‘జమిలి’…ప్రయోజనమెవరికీ!?

'Jamili'...who benefits!?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ మొత్తం దాదాపు రూ.90 లక్షల కోట్లు ఉంటుంది. ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నవారు 97 కోట్ల మంది ఉంటారు. ఐదేళ్లకోసారి విడతల వారీగా జరిగే ఎన్నికల కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ విధంగా లెక్కేస్తే ఒక్క ఓటర్‌ పై కేవలం రూ.20 మాత్రమే ఖర్చవుతుందని విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలు చేసే ఖర్చు ప్రజలకు పున:పంపిణీ జరుగుతుందని, దీనివల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తా యని చెప్పుకొచ్చినా దీన్ని ఖర్చుగా భావించరాదు. కేవలం రూ.5 వేల కోట్లు ఆదా అవుతాయనే కారణంతో జమిలీ ఎన్నికలకు వెళ్లడం సరైన చర్య కాదు.
మన దేశంలో బ్రిటీష్‌ నియంతృత్వ పాలన విముక్తి కోసం పోరాడి, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను సాధించుకున్నాం. ఈ దేశంలో అనేక మతాలు, కులాలు, ప్రాంతాలు, నైసర్గికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విభిన్న పరిస్థితులు భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఇలాంటి స్థితిలోనూ భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పదనం. అందుకే మన దేశాన్ని ”ఉపఖండం” అంటారు. ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య పాలనలో బహుళ పార్టీ విధానంలో ఎనభై ఏళ్లకు చేరుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతున్నాం. డాక్టర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ రచన కోసం దేశంలోని అన్ని వర్గాల, మతాల, ప్రాంతాల అభిప్రాయాలు సేకరించి ”భిన్నత్వంలో ఏకత్వం” సాధించేలా పాలకులకు ”రాజ్యాంగాన్ని” అందించారు. రాజ్యాంగం ప్రజల నుంచి వచ్చిందే, అది ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించింది. అణగారిన వర్గాలకు, జాతులకు, ప్రాంతాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించింది. కానీ ఇక్కడ జరగాల్సింది.. ప్రభుత్వాలు చేయాల్సిన ప్రధాన కర్తవ్యం రాజ్యాంగబద్ధ పాలన సాగించడమే. రాజ్యాంగ బద్దంగా పాలన నిర్వహించకుండా రాజ్యాంగాన్ని మార్చాలని, ఇది విదేశీ వలస రాజ్యాంగమంటూ ఏకంగా ఎన్నికల విధానాన్ని మార్చాలని స్వార్థ నియంతృత్వ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ఖర్చు పెరిగిపోతుందనే సాకుతో జమిలి ఎన్నికల పేరుతో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానం తేవడానికి కేంద్రం ఏకపక్షంగా నిర్ణయించింది. మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ వేసి, ఆ కమిటీ నివేదిక కేంద్రానికి సమర్పించగా, దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఆ తదనంతరం పార్లమెంటులో ఆమోదించుకొని అమలుచేయ పూనుకున్నారు. ఈ జమిలీ ఎన్నికలు మన దేశానికి నష్టమని, లౌకిక విలువలు, రాజ్యాంగ మూలాలకు విఘాతం కలిగిస్తుందని, రాజ్యాంగ బద్ధమే కాదని! అమలులో అసాధ్యమని, రాజకీయ సంక్లిష్ట సంక్షోభాలకు దారితీస్తుందని మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ పాలకుల నియంతఅత్వం తట్టుకోలేక స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడి ప్రజాస్వామ్య పాలన ఏర్పరుచుకున్నాం. దీన్ని బలహీనపరచడం అప్రజాస్వామికంగా మళ్లీ స్వార్థ రాజకీయాల్లో నియంతృత్వ అధికారం బలం కోసం చేసే బలహీన ప్రయత్నమే!. దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిర్బంధంగా కదలాలని, కేంద్ర ప్రభుత్వ పాలనలో గుత్తాధిపత్యం కోసం రాష్ట్రాల, స్థానిక సంస్థల స్వేచ్ఛను హరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమే అని మేధావులంటున్నారు. అమలులో ఎట్టి పరిస్థితుల్లో మన దేశానికి తోడ్పడదు. కావున ప్రజల విశ్వాసాలను, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షించండి. నిజాయితీ, చిత్తశుద్ధి దండిగా ఉంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల నిర్వహణ విధానంలో మేలైన మార్పులు తెచ్చి, రాజ్యాంగం స్వయం ప్రతిపత్తి కల్పించిన ప్రత్యేక సంస్థల్లో అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలి. ఎన్నికలకు ముందు అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని పాలకులను ”రీ కాల్‌” చేసేలా సవరణ తెస్తే బాగుంటుంది. ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించకుండా.. సాధ్యం కాని ”జమిలీ ఎన్నికల”ను ముందు పెట్టి ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించే ప్రయత్నమే.
మన దేశంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లోని స్థానిక ప్రభుత్వాలలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాల ఏర్పాటుకు అనేక సమీకరణలు ఉంటాయి. ఏదైనా రాష్ట్రంలో రెండున్నర ఏళ్లకే ప్రభుత్వం కూలిపోతే మిగిలిన రెండున్నరేేండ్లు అక్కడ ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం పెత్తనం చేస్తుందా? అనే ప్రశ్న మొదలవుతుంది. అలాగే రాజ్యాంగ లౌకిక విలువలకు, మూలాలకు విఘాతం జరగబోతోంది. ఇందులో ప్రధానంగా దేశంలో ఐదేండ్లలో రెండుసార్లు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. అయితే దీనికోసం 15వ రాజ్యాంగ సవరణను కమిటీ ప్రతిపాదించింది. రాజ్యాంగ మార్పుకు లోక్‌సభలో రెండింట మూడొంతుల మెజార్టీ (362 మంది సభ్యులు) ఉండాలి. కానీ ఇప్పుడున్న కేంద్ర సర్కారుకు ఆ మెజార్టీ లేదు. దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ 50 శాతం మద్దతు అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ మొత్తం దాదాపు రూ.90 లక్షల కోట్లు ఉంటుంది. ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నవారు 97 కోట్ల మంది ఉంటారు. ఐదేళ్లకోసారి విడతల వారీగా జరిగే ఎన్నికల కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ విధంగా లెక్కేస్తే ఒక్క ఓటర్‌ పై కేవలం రూ.20 మాత్రమే ఖర్చవుతుందని విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలు చేసే ఖర్చు ప్రజలకు పున:పంపిణీ జరుగుతుందని, దీనివల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పుకొచ్చినా దీన్ని ఖర్చుగా భావించరాదు. కేవలం రూ.5 వేల కోట్లు ఆదా అవుతాయనే కారణంతో జమిలీ ఎన్నికలకు వెళ్లడం సరైన చర్య కాదు. ఎన్నికల సంఘం విధించే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎమ్‌ సీ సీ) వల్ల ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కేవలం కొత్త పథకాల ప్రకటనలు, అమలుకు మాత్రమే వర్తిస్తుంది. రాజకీయ పార్టీలు తమకు అను కూలంగా ఎన్నికల ప్రక్రియను మార్చుకునేందుకు ”ఒక దేశం-ఒకే ఎన్నిక” నినాదం ముందుకు తెస్తుందని విశ్లేషకుల అంచనా. ఐదేండ్ల లోపు రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు కూలిపోతే, ప్రత్యేక పరిస్థితిలో ఖాళీ ఏర్పడితే ఏం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. గవర్నర్లు, స్పెషలాఫీసర్ల పాలనను దేశ ప్రజలు అంగీకరిస్తారా?
ఒక దేశం -ఒకే ఎన్నికలో పలు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీకి మెజా ర్టీ రాకుంటే ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేయాలనే పరిష్కారం లేదు. ఇప్పుడున్న విధానంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది. దాన్ని అమలు చేస్తే చాలు. ”జమిలీ ఎన్నికల నిర్వహణ” అంతిమంగా నియంతృత్వానికి దారి తీస్తుందనటంలో సందేహం లేదు. ఇది ఈ దేశ ప్రజలకు, దేశ స్వేచ్ఛ, సమన్వయ, సమాఖ్య స్పూర్తికి ఏ విధంగా తోడ్పడదు అని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం భేషజాలు వీడి ఎలాంటి చర్చలు జరపకుండా నియంతృత్వ ధోరణితో అమలు చేయడం శ్రేయస్కరం కాదు. నిపుణుల, విశ్లేషకుల, మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. గతంలోనే ఆగమేఘాల మీద వ్యవసాయ చట్టాలను తెచ్చి, ఆ తర్వాత ప్రజా పోరాటాలకు తట్టుకోలేక ”చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు” ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న గుణపాఠంతోనైనా వీటిని పున: పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

– మేకిరి దామోదర్‌, 9573666650