– నేడు ముంబయితో లక్నో ఢీ
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ గ్రూప్ దశ మ్యాచ్ ఆఖరు అంకానికి చేరుకుంది. అన్ని జట్లు గ్రూప్ దశలో ఆఖరు మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాయి. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు ఆశలు ఆవిరి చేసుకున్న జట్లు ఊరట విజయంతో సీజన్‌ను ముగించేందుకు సిద్ధమవుతున్నాయి. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఆ కోవలోకే వస్తాయి. ముంబయి ఇండియన్స్ 13 మ్యాచుల్లో 8 పరాజయాలు చవిచూడగా.. పంజాబ్ కింగ్స్ 13 మ్యాచుల్లో 9 పరాజయాలు మూటగట్టుకుంది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇటు పంజాబ్ కింగ్స్, అటు ముంబయి ఇండియన్స్‌కు ఈ సీజన్లో కొత్త కెప్టెన్ సారథ్యం వహించాడు. హార్దిక్ పాండ్య నాయకత్వంలో ముంబయి ఇండియన్స్ అన్ని రంగాల్లోనూ నిరాశపరిచింది. శిఖర్ ధావన్ నుంచి పగ్గాలు అందుకున్న శామ్ కరణ్ పంజాబ్ కింగ్స్‌ను ఆశావహ దృక్పథంతో ముందుకు నడిపించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు సాధించటంలో కరన్ కెప్టెన్సీ పాత్ర అమోఘం. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో ఇరు జట్లు విజయంపై కన్నేసి బరిలోకి దిగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌పై మెరుపు విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ నేడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. గత ఐదు మ్యాచుల్లో నాలుగింట పరాజయాలు చవిచూసిన ముంబయి ఇండియన్స్ ఆఖరు మ్యాచ్‌లోనైనా అంచనాలను అందుకునేందుకు ఎదురుచూస్తుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, జశ్‌ప్రీత్ బుమ్రాల ప్రదర్శనపై ప్రధానంగా ఫోకస్ ఉండనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట భారత క్రికెటర్ల ప్రదర్శనను అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ నేడు వాంఖడే స్టేడియంలో ముఖాముఖి తలపడనున్నాయి.