‘తులసి చందు’ కోసం…

స్వతంత్ర జర్నలిస్టు ”తులసి చందు”కు మద్దతుగా నేనిప్పుడు మాట్లాడుతున్న. ఎందుకంటే మూడేండ్ల క్రితం నేను చేసిన భావప్రకటనకు నొచ్చుకున్న మూకలు సోషల్‌ మీడియాలో చేసిన దాడిని చవిచూసిన అనుభవం నాకు ఉంది. ఒక జర్నలిస్టుగా నేను రాసిన వ్యాసం వల్ల నా వాట్సాప్‌ బూతు పురాణాలతో నిండిపోయింది. ఫేస్‌బుక్‌ బ్లాక్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే ఏ బెదిరింపు, ఏ మాటలు పడాల్సివస్తుందో తెలియని స్థితి. కుటుంబ సభ్యులను కోడ్‌ చేస్తూ ఆడవారిని ఇలాంటి మాటలు అనకూడదు అనే సంస్కారం కూడా లేకుండా ఆ ”మూక”లు చేసిన సోషల్‌ మీడియా దాడిని చవిచూశాను. పోలీసు కేసులు పెట్టాలని, తల తీసేయాలని, మర్మాంగాన్ని కోయాలని, ఇంట్లో ఆడవారిని లైంగికదాడి చేసి బుద్ది చెప్పాలని ఆ ”మూక”లు చేసిన సోషల్‌ మీడియా దాడి ఎలా ఉంటుందో తెలిసినవాడిని నేను. ఇంకా సూటిగా చెప్పాలంటే కాలక్రమంలో రాజద్రోహిగా జైలులో బంధించబడిన వాడిని. ఆ కేసును ఇంకా ఎదుర్కొంటున్న వాడిని. అందుకే స్వతంత్ర జర్నలిస్టు ”తులసి చందు” పరిస్థితి, మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి నాకొంచెం ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పదలుచుకున్న. ఏమో చెప్పలేం… ఈ రోజు సోషల్‌ మీడియా దాడి మాత్రమే జరిగింది. ఏదో ఒకరోజు ”తులసి చందు”పై కూడా రాజద్రోహి ముద్రపడొచ్చు. గౌరీ లంకేష్‌లాగా హత్యకు గురికావచ్చు. అందుకే ఇప్పుడు నేను ఆమె పక్షాన మాట్లాడదలుచుకున్న.
ఇప్పటికే భారత ప్రజాస్వామ్యం ఒక క్రమపద్ధతిలో విధ్వంసమైపోతున్నది. అన్నీ చూస్తూ మెజారిటీ పౌర సమాజం నిర్లిప్తంగా ఉంటున్నది. ఈ నిర్లిప్తత ఏమాత్రం మంచిది కాదు. ఇక సమస్య తనదాక రానప్పుడు ప్రజాస్వామ్యం, హక్కుల, పాలకుల విధానాల గురించి వేదికల మీద గొప్పగా మాట్లాడి ఆచరణలో ఆమడదూరంలో ఉండే సోకాల్డ్‌ జ్ఞానుల వల్ల ఏం ఉపయోగం లేదనేది నా భావన. ఎందుకంటే… నేనూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం గొప్పగా చెప్పుకునే దేశంలోనే జీవిస్తున్న కాబట్టి. ఇంతకీ ”తులసి చందు” చేసిన తప్పేంటి..? ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటన చేయడం, జరుగుతున్న పరిణామాలను విశ్లేషించడమే నేరమా..? ఆమె చేసిన వీడియో విశ్లేషణలు అంతగా నొప్పిస్తే మొత్తం మీడియా రంగమే తమ గుప్పిట్లో ఉన్నవారు చేయాల్సినది ఏమిటి..? వారు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ”డిబెట్‌” సాగించాలి. కానీ ఇవేమి చేయకుండా మానసికంగా వేధించడమేంటి? ఇష్టమొచ్చినట్లుగా బెదిరించడమేంటి? ఇది అధికార ఆధిపత్యానికి నిదర్శనం కాదా..? ఇంకెవరూ మాట్లాడొద్దు. అందులో ఒక మహిళా అసలే మాట్లాడొద్దు… అనే సంకేతమా ఇది? ఇదా ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మహిళల స్థానం ఇదేనా..? ఈ పాలకులు మహిళలకు ఇచ్చే భరోసా ఇదేనా… ఈ స్థితిని ఎదుర్కొంటున్నది ఒక తులసి చందు మాత్రమే కాదు, గతం నుండి ఎదుర్కొంటున్న మహిళలు ఉన్నారు. భవిష్యత్తులో ఇంకెందరో ఇండొచ్చు. మాట్లాడే గొంతులను, కలాలను ఎలాగూ పాలకులు అణిచేయాలని చూస్తారు. అది రకరకాల పద్ధతుల్లో కట్టడి చేస్తారు. సోషల్‌ మీడియా దాడికావచ్చు, భౌతిక దాడి కావచ్చు, కేసులు పెట్టి, జైల్లో పెట్టి, చివరాకరకు చంపేసి కూడా కట్టడి చేస్తారు. అందుకే, ఈ పౌరసమాజం ఎరుకతో ఉండాలి. పౌరసమాజానికి అవసరమైన మనుషులను కాపాడుకోవాలి. ఈ సందర్భంలో ”తులసీ చందు”కు మద్దతుగా నిలుస్తున్న వ్యక్తులకు, శక్తులకు సెల్యూట్‌. అయితే ఈ సంఘీభావం మాత్రమే సరిపోదు. ఇంకా నిర్లిప్తంగా ఉన్న పౌర సమాజం ఉలిక్కిపడి నిద్రలేచేలా ఉండాలి. ప్రశ్నించే వారిని, మాట్లాడే వారిని, రాసేవారిని, భావప్రకటన చేసేవారిని కాపాడుకునేలా, ఒక ధైర్యాన్ని నింపేలా సంఘీభావ ఉద్యమం జరగాలి. తులసీ చందు ఒంటరి కాదు అనే సంకేతాన్నివ్వాలి. ప్రశ్నించే వారికి, భావప్రకటన చేసేవారికి, మాట్లాడేవారికి ధైర్యాన్ని ఇచ్చేలా, ధ్వంసమవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేలా పౌరసమాజం బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలి.
చివరగా… ”ఆంటోనియా గ్రాంసీ” మాటలు ఇక్కడ సందర్భోచితంగా భావిస్తున్న. ”గ్రాంసీ” మాటల్లో… నిర్లిప్తులంటే నాకు నిలువెల్లా అసహ్యం..! బతికి ఉండడమంటే, అటో ఇటో నిలబడడమేనన్నది నా నమ్మకం. నిజంగా సజీవులుగా వున్న వాళ్ళు పౌరులుగానూ, పక్షపాతులుగా ఉండక తప్పదన్నది నా మరో విశ్వాసం. నిర్లిప్తత, నిరాసక్తత అనేవి – పరాన్నభుక్కులు గానూ, పెడబుద్ధులు గానూ మనుగడ సాగించడమే తప్ప జీవ లక్షణాలు కావు.! అందుకే, నిర్లిప్తులంటే నాకు నిలువెల్లా అసహ్యం.!! ఇవి ”గ్రాంసీ” మాటలు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యమే అని గ్రహించాలి. స్వతంత్ర జర్నలిస్టు ”తులసి చందు” ఎటు నిలబడాలో తేల్చుకుంది. ఆమె భావ ప్రకటనే అందుకు సాక్ష్యం. ఇక తేల్చుకోవాల్సింది పౌర సమాజమే… – రాజేందర్‌ దామెర