– ఏటీవీఎమ్‌లు వినియోగించండి
– మొబైల్ యాప్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకోవచ్చు
– రైల్వేస్టేషన్లలో రద్దీ నివారించండి
– ప్రయాణికులకు ద.మ.రైల్వే విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైల్వే స్టేషన్లలో క్యూలైన్ల రద్దీని నివారించేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు. అన్ రిజర్వుడు టిక్కెట్ల కోసం రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషిన్(ఏటీవీఎమ్)లు వినియోగించుకోవాలని బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే అన్ రిజర్వ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) మోబైల్ యాప్ ద్వారా కూడా టిక్కెట్లు పొందవచ్చనీ, ఆర్ వ్యాలెట్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకోవచ్చని తెలిపారు. ఈ పద్ధతుల ద్వారా టిక్కెట్లు తీసుకుంటే ప్రయాణీకులకు మూడు శాతం బోనస్ వర్తిస్తుందన్నారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిలబడకుండా సమయాన్ని ఆదా చేసుకోవచ్చని వివరించారు. యూటీఎస్ మోబైల్ యాప్‌ను ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.