బతుకు మార్చని బడ్జెట్‌ ఎవరికోసం?

Who is the unsustainable budget for?కేంద్ర బడ్జెట్‌ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందా? ఉద్యోగులకు ఇచ్చిన పన్ను రాయితీ సర్వరోగ నివారిణి అవుతుందా? దేశం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఆర్థిక సర్వే రిపోర్టు ఏమి చెపుతున్నది? ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ఆర్థిక సంవత్సరం భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాల కన్నా తగ్గింది. ఇందుకు కారణాలను ఆర్థిక సర్వే లోతుగా విశ్లేషణ చేసింది. దేశంలో సరుకుల అమ్మకాలు తగ్గిపోయాయని, తగిన వేతనాలతో కూడిన ఉపాధి అవకాశాలు పడిపోయాయని, ద్రవ్యోల్బణం సమస్యగా మారిందని తేల్చింది. నెలసరి వేతన జీవులకు, స్వయం ఉపాధి కార్మికులకు గత ఐదేండ్లలో నిజవేతనాలు దిగజారిపోయాయి. 22 కోట్ల ప్రజల దినసరి ఆదాయం కేవలం రూ.300. మోడీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం క్షేత్రస్థాయి దినసరి కనీస వేతనం రూ.78 -ఇస్తే చాలు. అంటే నెలకు రూ.4628లతో కుటుంబం బతకాలి! ఉపాధి హామీ చట్టం ప్రకారం కల్పించవలసిన వందరోజుల పనిదినాలు కూడా 2019 తర్వాత సగటున 45కు తగ్గాయి. వీటన్నింటి ఫలితంగానే దేశ ప్రజలు సరుకుల కొనుగోలుపై పెట్టే ఖర్చుగానీ, పొదుపుగానీ తగ్గి పోయాయి. ఈ పరిస్థితి మారాలంటే, కేంద్ర ప్రభుత్వం చెపుతున్న వికసిత భారత్‌ను సాధించాలంటే రానున్న పది నుంచి ఇరవై సంవత్సరాల పాటు స్థూల జాతీయోత్పత్తి ఎనిమిది శాతానికి తగ్గవద్దని ఆర్థిక సర్వే రిపోర్టు చెప్పింది. కానీ రానున్న ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయో త్పత్తి 6.3నుంచి 6.8శాతం మధ్య మాత్రమే ఉండే అవకాశం ఉందని కూడా ఇదే రిపోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ ప్రతిపక్షాల కుట్రలు కాదు. విదేశీ కుట్రలు అంతకంటే కాదు. దేశద్రోహుల ఆరోపణలు కూడా కాదు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితం. చెప్పింది భారతదేశ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌. ఈ రిపోర్టును పార్లమెంటు ముందుంచింది సాక్షాత్తూ దేశ ఆర్థికశాఖా మంత్రి. బడ్జెట్‌ ప్రతి పాదనలు ఈ సమస్యల జోలికే పోలేదు. పైగా ఇప్పటిదాకా అమలు జరుపుతున్న సరళీకృత ఆర్థిక విధానాలనే మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. ఇప్పటికే కార్మిక చట్టాలు రద్దుచేశారు. వాటి స్థానంలో కోరలు లేని లేబర్‌కోడ్స్‌ తెచ్చిపెట్టారు. రద్దయిన చట్టాల్లో వలస కార్మికుల భద్రతా చట్టం కూడా ఒకటి. ఇప్పుడు పరిశ్రమల్లోగానీ, అసంఘటితరంగంలో గానీ దాదాపు సగం మంది వలస కార్మికులే. యూనియన్ల ఏర్పాటు కూడా కష్టంగా మారింది. ఫలితంగా సమిష్టి బేరసారాల శక్తి కూడా తగ్గింది. వ్యవసాయ కూలీలు, పేద రైతులు, కౌలు రైతుల ఊసెత్తడానికి కూడా పాలకులు సిద్ధంగా లేరు. రైతు పండించిన పంటకు మద్దతుధర చట్టబద్ధం చేసేందుకు మోడీ ప్రభుత్వం నిరా కరిస్తున్నది. వీటన్నింటి ఫలితంగానే ప్రజల ఆదాయాలు పడిపోయాయి. ప్రజల అవసరాలు కూడా పెరిగాయి. మోటార్‌ సైకిల్‌, సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం నిత్య జీవితావసరాలుగా మారాయి. విద్యుత్తు వినియోగం పెరిగింది. మారుమూల గ్రామాల్లో కూడా మంచినీరు కొను క్కోవలసి వస్తున్నది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల ప్రజలమీద తీవ్ర ప్రభావం చూపుతున్నది. అంతి మంగా చదువు, వైద్యం కూడా ఖర్చుతో కూడినవిగా మారాయి. ఇంటి కిరాయిలూ పెరిగాయి.
జనం సమస్యలతో సతమత మవుతుంటే మోడీ ప్రభుత్వం మాత్రం బడాబాబుల పంచన చేరింది. సబ్సిడీలకు ‘ఉచితాలు’ అని పేరు పెట్టింది. వీటిని ప్రోత్సహించకూడదని సుప్రీం కోర్టుకు తన అభిప్రాయంగా తెలియజేసింది. బడా పెట్టుబడిదారులకు, ఫామ్‌హౌజ్‌ల యజ మానులకు మాత్రం ఖజానాను దోచిపెట్టింది. ‘రాయితీలు’ అని ముద్దుపేరు పెట్టింది. రైతుల రుణమాఫీకి అంగీకరించని మోడీ ప్రభుత్వం, గత పదేండ్లలో బడాబాబులు బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా బకాయిపెట్టిన రూ.14.46లక్షల కోట్లు మాఫీ చేసింది. ఎగవేతదారులకు అండగా నిలిచింది. కార్పొరేట్‌ సంస్థలు చెల్లించవలసిన పన్ను పదిశాతం తగ్గించింది. బడాబాబులకు పండగే కదా. ఏడాది కాలంలో దేశంలో శత కోటీశ్వరుల సంఖ్య 109 నుంచి 200లకు పెరిగిందని ఫోర్బ్స్‌ నివేదిక బట్టబయలు చేసింది. కార్పొరేట్‌ సంస్థల లాభాలు 22.3శాతం పెరిగాయని ఎకనమిక్‌ సర్వే రిపోర్టు తేల్చింది. అంతేనా, గత పదిహేనేండ్లలో వీరి ఆదాయం అనూహ్యంగా పెరిగిందని చెప్పింది. దేశ జనాభాలో ఒక్క శాతంగా ఉన్న ధనికుల చేతుల్లో 40.1శాతం దేశ సంపద పోగైందని ప్రపంచ అసమానతల రిపోర్టు తేల్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎకనామిక్‌ సర్వే రిపోర్టు, ప్రజల కొనుగోలుశక్తి మీద దృష్టి సారించింది. అంటే బడ్జెట్‌లో ప్రజల ఆదాయాలు పెంచే విధంగా ప్రతిపాదనలుండాలి. ప్రభుత్వం చేసే ఖర్చు పెరగాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆర్థిక సర్వే చెప్పింది. తయారీరంగం అభివృద్ధి గురించి హెచ్చరించింది. ఆహార సరుకుల ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు పెంచాలన్నది. పెద్దఎత్తున నిల్వ చేయాలన్నది. కొరత సమయంలో ఆహార నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేయడం ద్వారా దిగుమతులను అరికట్టాలని చెప్పింది. తగిన నెలసరి ఆదాయం ఉన్న ఉద్యోగాలు కనీసం ఏడాదికి 78.5లక్షలు కల్పించాలన్నది. కార్మిక చట్టాల రద్దుతో 8గంటల పనిదినం స్థానంలో ఇప్పటికే పన్నెండు గంటల పనిదినం అమలులోకి వచ్చింది. దీనివల్ల కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యాలు దెబ్బతింటాయని, స్థూల జాతీయోత్పత్తి మీద దాని ప్రభావం ఉంటుందని ఆర్థిక సర్వే రిపోర్టు హెచ్చరించింది. పారిశ్రామికవేత్తల సంఘాలకు మాత్రం ఇది రుచించడం లేదు. ఆర్థికసర్వే రిపోర్టు చైనా గురించి కూడా ప్రస్తావించింది. గత పదేండ్లలో చైనా ప్రజల ఆదాయాలు పెరగడం వల్ల అంత ర్గతంగా సరుకుల వినిమయం బాగా పెరిగింది. తయారీరంగం బాగా అభివృద్ధి చెందింది. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉత్పత్తి కూడా శరవేగంగా పెరిగింది. మరోవైపు భారతదేశం మాత్రం ఈ కాలంలో ఇటు అభివృద్ధి చెందుతున్న దేశాలతో గానీ, అభివృద్ధి చెందిన దేశాలతో గానీ పోటీ పడగల స్థితిలో లేదని గుర్తుచేసింది. రానున్న కాలం కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదని పెదవి విరిచింది. ట్రంప్‌ ప్రభుత్వ టారిఫ్‌ విధానాలు భారతదేశం ఆశల మీద నీళ్లు చల్లుతున్నాయని ఆర్థిక సర్వే హెచ్చరించింది. అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుకులు కూడా మనకు ఆటంక మేనన్నది. దేశంలో పారిశ్రా మిక సరుకుల ధరలు కూడా సమస్యగా మారవచ్చునన్నది. ఇవన్నీ గమనించిన వారెవరికైనా మన దేశంలో ప్రజల ఆదాయాలు పెంచే చర్యలు తీసుకోవాలన్నది సులభంగానే అర్థమవుతున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో లేనిది కూడా ఇదే. ఇప్పుడు మనం ఎగుమతుల మీద ఆశలు పెంచుకోవడం హాస్యాస్పదం. ఏవిధంగా చూసినా ప్రజల కొనుగోలు శక్తి పెంచడం అత్యంత కీలకం.
గతేడాది బడ్జెట్‌లోనే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి హామీ, ఎరువులు, వంటగ్యాస్‌, ఆహార సబ్సిడీలకు కేటాయింపులు బాగా తగ్గించింది. ఈసారి బడ్జెట్‌లో కూడా సుమారు అవే మొత్తాలను ప్రతిపాదించింది. పెరిగిన ధరలతో పోల్చినా, బడ్జెట్‌తో లేదా స్థూల జాతీయోత్పత్తితో చూసినా వీటికి కేటాయింపులు తగ్గించింది. విద్యుత్తు రంగాన్ని ప్రయివేటుపరం చేయాలన్నది. బీమా రంగంలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించింది. నగదీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టి రూ.10లక్షల కోట్లు సమకూర్చుకోవాలని చెప్పింది. ఇప్పటికే జీఎస్టీ పేరుతో ప్రజల మీద పన్నుల భారం పెరిగింది. నిరుద్యోగుల అప్లికేషన్‌ ఫారాలను కూడా వదలకుండా పద్దెనిమిది శాతం పన్ను విధించింది. దేశంలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి సమకూరుతున్న పన్ను ఆదాయంలో ధనికులు చెల్లిస్తున్న దానికన్నా సాధారణ ప్రజలు చెల్లిస్తున్నదే ఎక్కువ. జీఎస్టీతో సంబంధం లేని చమురు ధరల గురించి ప్రశ్నిస్తే చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ స్పందించలేదు. ప్రజల ఆదాయాలు పెంచేందుకు తగిన కేటాయింపులు జరగాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరగాలి. బడ్జెట్‌ సైజు పెరగాలి. కానీ గత పదిహేనేండ్లుగా క్రమంగా స్థూల జాతీయోత్పత్తితో పోల్చితే బడ్జెట్‌ సైజు తగ్గుతూ వస్తున్నది. 18శాతం నుంచి ఈ బడ్జెట్‌ 14.2శాతానికి పడిపోయింది. ఇందులో బడాబాబులకిచ్చే రాయితీల పేరుతోనే ప్రభుత్వానికి రావలసిన ఆదాయం ఏటా రూ.1,45,000 కోట్లు కోల్పోతున్నది. మోడీ అధికారంలోకి రాగానే 2015లోనే సంపద పన్ను రద్దు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వారసత్వపు పన్ను విధిస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్త పికెట్టీ సూచించిన విధంగా రూ.10కోట్లు అంతకుమించిన ఆదాయం ఉన్న ధనికుల మీద సంపద పన్ను పునరుద్ధరించి కనీసం 33శాతం వారసత్వపు పన్ను విధిస్తే కేంద్ర ప్రభుత్వానికి కావలసినంత ఆదాయం పెరుగుతుంది. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెంచేవిధంగా ప్రభుత్వ కేటాయింపులు బాగా పెంచవచ్చు. కానీ పాలకులు ఇందుకు సిద్ధంగా లేరు. నెలజీతం పొందుతున్న ఉద్యోగులనుంచి ఆదాయం పన్ను రూపంలో 30శాతానికి పైగా వసూలు చేస్తున్న కేంద్రం శతకోటీశ్వరుల నుంచి మాత్రం తక్కువ పన్ను వసూలు చేస్తున్నది. ఇప్పుడు 12లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయించి సంబురపడమంటున్నది. బడాబాబులకు ఇస్తున్న రాయితీల్లో ఉద్యోగులకిచ్చిన రాయితీ సముద్రంలో నీటిబొట్టు. సంపద పోగవుతున్న కుబేరులను నొప్పించడం పాలకులకు ఇష్టం లేదు. అందుకే ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్‌. ఇప్పుడే కాదు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ ఒక నిజం చెప్పారు. ‘నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో గత యూపీఏ ప్రభుత్వంగానీ, ఇప్పుడు ఎన్డీయే సర్కార్‌ గానీ రెండూ విఫలమ య్యాయి’ అన్నారు. నిజమే! బడాబాబుల మీద పన్నులు పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోకుండా ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యం కాదుగదా. ఈ మౌలిక విషయాన్ని పరిష్కరించగలిగే రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం. అది ఎర్రజెండాకు మాత్రమే సాధ్యం.
ఎస్‌.వీరయ్య