ప్రజా సమస్యలపై ఏనాడు నోరు విప్పని ఈ దేశ ప్రధాని, ప్రజల భావోద్రేకాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో మాత్రం అసంబద్ధ ఉదాహరణలతో ఉపన్యాసాలు దంచి కొడుతున్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ ఉన్న దేశ ప్రజల మధ్య ఉమ్మడి పౌరస్మృతి’ పేరుతో చిచ్చుపెట్టి మైనారిటీ వర్గాలను టార్గెట్‌గా చేస్తున్న వ్యూహరచనలో భాగమే తాజా పరిణామాలు.
భిన్న మతాలు, సంస్కృతులున్న భారత్ లాంటి పెద్ద దేశాల్లో సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడమనేది అసాధ్యమైన విషయం. మతాన్ని బట్టి భిన్న మైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. జన గణనలో మతం కాలమ్‌లో ”సర్నా”ను చేర్చా లన్న జార్ఖండ్ ప్రకృతి ఆరాధకుల డిమాండ్ ఉండనే ఉంది. హిందువుల్లోనూ భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వాళ్లున్నారు. ముస్లింలలోనూ షరియా చట్టాలను పాటించని వాళ్లున్నారు. ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను అనుసరించే ముస్లింలున్నారు. క్రైస్త వులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయి. వాటికి ఆధారం సంప్రదాయాలే గానీ మతం కాదు. ఆస్తుల వారసత్వం విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా చట్టాలున్నాయి.
ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని గత పదేండ్ల మోడీ పాలనలో వివిధ రకాల చట్టాలు అమల్లోకి వచ్చా యి. అయితే యూసీసీ విషయంలో బీజేపీ ఆటలు ఇంకా సాగడం లేదు. రెండు మూడుసార్లు ప్రయత్నించినా విఫల మైంది. ఇక లాభంలేదని నెమ్మదిగా రాష్ట్రాల్లో అమలుకు చట్టాలు చేయడం ద్వారా మైనారిటీలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవలనే ఉత్త రాఖండ్‌లో ఇది చట్టమైంది. తాజాగా 1935వ సంవత్సరం నాటి ‘ముస్లిమ్ మ్యారేజెస్ అండ్ డివోర్సెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ రద్దుకు అస్సాం శాసనసభ శుక్రవారం నాడు ఆమో దముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశగా ఇదొక ముఖ్యమైన అడుగు అవుతుందని ఆ రాష్ట్ర మంత్రి జయంత మల్లా బారువా ఈ చట్టం రద్దు వెనుక ఉన్న ఉద్దేశాన్ని వెల్లగక్కారు. ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో బాల్యవివాహాలను నిలువరించ వచ్చన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తనకు తానుగా బాల్యవివాహాల వ్యతిరేక ఉద్యమ సంస్కర్తగా ప్రచారం చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. వధూ వరులకు 18-21 ఏండ్లు నిండకుండానే పెండ్లి చేసుకోవ డానికి అనుమతినిచ్చే శతాబ్దం క్రితం నాటి చట్టం మనకు అవసరమా? అని సీఎం హిమంత ‘ఎక్స్’ వేదికగా చెప్పుకొచ్చారు. అందుకే ఈ చట్టా న్ని రద్దు చేయడం అస్సాం చరిత్రలోనే కా కుండా దేశచరిత్రలోనే ఒక మేలిమలుపు అవుతుందని అర్థం వచ్చేలా పెద్దపెద్ద ప్రవచనాలే వల్లించారు. ఈ దేశాన్ని మనువుకాలం నాటికి మోసుకుపోవడానికి ఆర్‌ఎస్‌ఎస్- బీజేపీ చేస్తున్న యత్నాలను ఆయన విస్మరించి నట్టున్నారు.
యూసీసీ జోలికి రాజ్యాంగ నిర్మాతలే వెళ్లలేదు. ఎందు కంటే భిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనమైన భారత దేశంలో యూసీసీ వల్ల ఉపయోగం లేదని, పైగా అది సమస్యలను తీసుకు వస్తుందని గ్రహించి రాజ్యాంగంలో 25, 26, 27, 28 అధికరణలను చొప్పించారు. ప్రతి వ్యక్తీ తనకు ఇష్టమొచ్చిన మతాన్ని స్వీకరించి, ఆచరించవచ్చని ఈ రాజ్యాంగ అధికరణలు స్పష్టం చేస్తున్నాయి. ఎటొచ్చీ మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44వ అధికరణను అడ్డం పెట్టుకొని దాన్ని ఉమ్మడి పౌరస్మృతికి వర్తింపచేయాలని తెగ ఆరాటపడి పోతున్నది. ముస్లిం తలాక్ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా యూసీసీ కోసం తొలి అడుగు వేశానని చెప్పుకునే బీజేపీ ఇప్పుడు తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో వారికి హక్కులు కల్పించే చట్టా లను ఒక్కొక్కటిగా రద్దు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగమే అస్సాంలో ముస్లిం వివాహాల చట్టం రద్దు చర్య. అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం చేసిన ఒక చర్య గురించి ఇంతలా పట్టించుకోవాలా అనే సందేహం వద్దు. దీని వెనుక బీజేపీ అతిపెద్ద ఎజెండానే ఉంది. ముస్లిం వివాహ రిజిస్ట్రార్ల నుంచి రికార్డులను స్వాధీనం చేయాలన్న ఆదేశాలు అందులో భాగమే.
యూసీసీ బిల్లును త్వరలోనే తీసుకువస్తామని కూడా సెలవిచ్చి, ప్రమాదం పొంచి ఉందని బారువా సంకేతాలిచ్చారు. మరోవైపు, ఉత్తరాఖండ్ లో ఆదివాసిలను మినహాయించింది. కానీ, అక్కడి ముస్లిం, ఇతర మైనారిటీలు ఆగ్రహంతో ఊగిపోతు న్నారు. తమ మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని, తమకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాస్తున్నారని ఆవేదన వెలిబుచ్చడంలో ఆశ్చర్యం లేదు. గుజరాత్‌లోనూ బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉంది. బీజేపీనే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే యూసీసీ బిల్లును దేశ వ్యాప్తంగా అమలయ్యేలా తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందనేది పచ్చి నిజం.