కేంద్ర ప్రభుత్వం శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్ట్‌కి విదేశీ నిధులు పొందడానికి అనుమతి మంజూరు చేసింది. విదేశీ నిధులు పొందడానికి ‘విదేశీ నిధుల నియంత్రణ చట్టం’ ప్రకారం ప్రభుత్వ లైసెన్స్ పొందడం తప్పనిసరి. ఈ నెల 18న ఆ లైసెన్స్‌ని ట్రస్ట్ పొందిందని ఆ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రారు వెల్లడించారు. ‘స్వదేశీ నిధుల ద్వారా పొందిన నిధుల్లోంచే రూ.900 కోట్లతో ఆల య మొదటి అంతస్తు నిర్మాణం జరిగింది. ఆ నిధుల్లో ఇంకా రూ.3 వేల కోట్ల దాకా వివిధ డిపాజిట్ల కింద ఉన్నాయి. డిసెంబర్ వరకు ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. 2024 జనవరి చివర్లో ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. రాముడి విగ్రహం ఫొటోను 10 లక్షల కుటుంబా లకు అందజేయడం మా లక్ష్యం. దాంతో పాటు 5 లక్షల గ్రామాలకి అక్షింతలు పంచుతాం. వీటన్నింటి కోసం ఉన్న నిధు లతో పాటు విదేశీ నిధుల వినియోగం జరుగుతుంది’ అని చంపత్ రారు తెలిపారు.
ఇదంతా చూస్తుంటే మనకు ఏం అర్థమవుతోంది. ఈ అక్షింతల వితరణ ద్వారాగాని, ఫొటోలు పంచడం వలన గాని, ప్రజలకు లేదా సమాజానికి, దేశానికి గాని ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్షింతలు తలపై చల్లుకోవడం, ఫొటోకి ప్రేమ్ కట్టించి పూజగదిలో పెట్టి దండం పెట్టుకోవడానికి తప్ప మరో దానికి పనికిరాదు. ఇది నిరుద్యోగాన్ని పోగొట్టి ఉద్యోగ కల్పన కలిగించదు. ధరలను కానీ ఆర్థిక మాంద్యాన్ని కానీ తగ్గిం చదు. అందుకు బదులుగా ఈ నిధులను సమాజహితం కోసం ఉప యోగించవచ్చు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రారంభిచడం ద్వారా కానీ, లేదా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా కొన్ని వేలమందికి ఉద్యోగాలు కల్పించొచ్చు. కానీ ఇందుకు భిన్నంగా దేవుడు, భక్తి అని మూఢనమ్మకాలని ప్రోత్సహించడం సరై నది కాదు. సరే రామజన్మ భూమి ట్రస్ట్‌కి విదేశీ నిధుల కోసం లైసెన్స్ ఇస్తే ఇచ్చారు, కానీ బాధాకరమైన విషయమేమిటంటే 2020లో సమాజహితం కోసం పనిచేసే పదివేల ప్రభుత్వేతర సంస్థల ఎన్‌జీఓల లైసెన్సులను రద్దు చేసారు. 2022లో మరో 6000 సంస్థల లైసెన్సులు రద్దయ్యాయి ఇందులో ఎన్‌జీఓ సంస్థ లతో పాటు ప్రఖ్యాతి పొందిన మదర్‌థెరిసా సంస్థ అయిన మిషన రీస్ ఆఫ్ చారిటీస్‌తో పాటు, ప్రభుత్వ సంస్థలైన ఢిల్లీ విశ్వ విద్యాలయం, ఐఐటీ ఢిల్లీ, జామియా మిలియా విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫామ్ ఇండియా లాంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. ఐటీ ఢిల్లీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, జామియా మిలియాల విదేశీ నిధులు ఆపడమంటే పేదలకి, అట్టడుగు వర్గాలకి అతి తక్కువ ఖర్చుతో లభించే ఉన్నత విద్యను వారికి దూరం చేయడమే.
ఈ విద్యాలయంలో చదివి విదేశాలలో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు ఈ నిధులను తమ విద్యాలయాల బాగుకోసం నిధులను పంపుతుంటారు. సహజంగా ఎన్‌జీఓ సంస్థలు, పేద, వీధి బాలల, ఆదివాసి, గిరిజనుల ఉన్నతికి పనిచేస్తుంటాయి. తిండి, బట్ట, గూడు కల్పిస్తుంటాయి. వైద్య, విద్య సౌకర్యాలు కల్పిస్తుంటాయి. వీటి విదేశీ నిధులను ఆపడమంటే… తాను పెట్టదు, పెట్టేవాళ్ళని పెట్టనీయదు అన్నట్లుగా ఉంది. ఈ మధ్యనే థింక్ ట్యాంక్ అనబడే ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ తో పాటు పిల్లలు, మహిళలు ఇంకా లైంగిక హింసతో బాధపడే వారి కోసం పనిచేసే మరో మూడు ఎన్‌జీఓల లైసెన్స్‌లు రద్దు చేయబడ్డాయి. హందర్ద్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐఐటీ ఢిల్లీ, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మొనీ, ఢిల్లీ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్, గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ మేనేజ్‌మెంట్ (కలకత్తా), దేశవ్యాప్తంగా సుమారు డజన్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ఇమ్మాను యేల్ ఆసుపత్రి అసోసియేషన్ కూడా ఉన్నట్లు ‘న్యూస్ క్లిక్’ సమా చారమని ‘ది వైర్’ పేర్కొంది. ఏది ఏమైనా రామ్ మందిర్ ట్రస్ట్‌కి విదేశీ నిధుల లైసెన్స్ ఇస్తే ఇచ్చారుగాని, ఇతరుల లైసెన్సులు రద్దు చేయటం మాత్రం అన్యాయం.
‘ది వైర్’ నుండి సేకరణ : పలకంశెట్టి జయప్రకాశ్
సెల్ : 837485426